విలీనంపై మార్చి 3న నిర్ణయం: కెసిఆర్, జైరాంపై ఫైర్

హైదరాబాద్: తమకు ఆంధ్ర పార్టీలు అవసరం లేదని, తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీని ఖాళీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మహేందర్ రెడ్డి, రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా జరిగిన సభలో ఆయన శుక్రవారం ప్రసంగించారు. తెలంగాణలోని వివిధ వర్గాలకు ఆయన హామీల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

చంద్రబాబు నాయుడు చివరి నిమిషం దాకా పార్లమెంటు సెంట్రల్ హాల్లో విషపు నవ్వు నవ్వుకుంటూ తెలంగాణకు అడ్డు పడడానికి ప్రయత్నించారని, ఈ విషయాన్ని బిజెపి నాయకుడు వెంకయ్య నాయుడే చెప్పారని, అటువంటి చంద్రబాబు అటువైపు మాట్లాడుతాడా ఇటువైపు మాట్లాడుతాడా అని ఆయన అన్నారు. మనల్ని మనమే పరిపాలించుకుందామని ఆయన అన్నారు. ఆరేడు ఏళ్లలో బంగారు తెలంగాణను సాధించుకుందామని, అందుకు పటిష్టమైన నాయకత్వం కావాలని ఆయన అన్నారు.

KCR

కేంద్ర మంత్రి జైరాం రమేష్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మర్యాదగా ఉంటే కలిసి పనిచేద్దామని అనుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని జైరాం రమేష్‌కు తెలంగాణ సెంటిమెంట్ ఏం తెలుసునని ఆయన అడిగారు. సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి జైరాం అని ఆయన అన్నారు. కాంగ్రెసులో పార్టీ విలీనంపై ఆయన కార్యకర్తల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఏదైనా తానొక్కడినే తీసుకోబోనని, పార్టీలోని అందరితో చర్చించి మార్చి 3వ తేదీని నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు.

కాంగ్రెసులో పార్టీ విలీనంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని, తెలంగాణకు ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకుందామని ఆయన అన్నారు. తెలంగాణను సాధించుకున్న స్ఫూర్తితోనే రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకుందామని ఆయన అన్నారు. బలహీనవర్గాలకు 125 చదరపు గజాల్లో అన్ని సౌకర్యాలతో మంచి ఇళ్లు కట్టిచ్చి ఇస్తామని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లాకు కృష్ణాజలాలను అందించే బాధ్యత తనదని ఆయన అన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. 2001లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమం లక్ష్యాన్ని చేరుకుందని, ఈ ఊపు తెలంగాణ పునర్నిర్మాణం కోసం సాగించాలని ఆయన అన్నారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా నిర్బంధ ఉచిత విద్యను అమలు చేస్తామని, అందరికీ ఒకే సిలబస్ ఉంటుందని ఆయన అన్నారు. అందరికీ ఇంగ్లీషు మాధ్యమం చదువులే ఉంటాయని ఆయన చెప్పారు.

బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో బతకాలని, దళితులకు ఒక్కొక్కరికి మూడేసి ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. దళితులకు యేటా 50వేల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. అణగారిన వర్గాల కోసమే తెలంగాణ అని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రతి జిల్లాలో నిమ్స్ తరహా ఆస్పత్రిని, మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

రెండేళ్లలో 15 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సవాల్ అని, అది చేసి తీరాలని ఆయన అన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కావాలని ఆయన అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయనున్నట్లు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. 24 జిల్లాలతో తెలంగాణను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. వితంతువులకు నెలకు వేయి రూపాయల చొప్పున, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పింఛను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+