కెసిఆర్ ధీమా: జట్టుపై కసరత్తు, అక్బరుద్దీన్ డిసిఎం?
హైదరాబాద్: పూర్తి మెజారిటీ సాధిస్తామనే ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు ఇప్పటికే తన జట్టు కూర్పులో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ ఇప్పటికే తెరాస నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. ఈ స్థితిలో బలమైన జట్టును ఏర్పాటు చేసుకోవడానికి కెసిఆర్ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
జట్టు కూర్పుపై పార్టీ ముఖ్య నేతలు ఈటెల రాజేందర్, టి.హరీశ్‌రావు, కెటి రామారావు, కవితలతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలుడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జూన్ 2 లేదా ఆ తర్వాత కొలువు తీరుతుంది. తెలంగాణలో ఎక్కువలో ఎక్కువగా ముఖ్యమంత్రితో కూడి 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

2001లో తెరాసను ఏర్పాటు చేసినప్పటి నుంచి అధ్యక్షుడిగా ఉన్న కెసిఆర్‌కు ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన కొద్ది మంది విషయంలో తప్ప, మిగిలిన వారందరి వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, పనితీరు, సమర్థతపై పూర్తి అవగాహన ఉంది. అయినప్పటికీ, పార్టీలోని కీలక నేతల అభిప్రాయాలను ఆయన సేకరిస్తున్నారని అంటున్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవాలని కెసిఆర్ నిర్ణయించినట్లు గురువారం వార్తలు వచ్చాయి. మంత్రివర్గ కూర్పు జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు ఔత్సాహికులు కెసిఆర్‌ను కలిసి వెళ్తున్నారు. వారి తరఫున ఆయా నియోజకవర్గాల పార్టీ నేతలు కూడా కెసిఆర్‌పై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది.
16న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెరాస శాసనసభాపక్షం సమావేశమై కెసిఆర్‌ను తమ నాయకుడిగా ఎన్నుకోవటం లాంఛనమేనని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పదవిని ముస్లిం మైనార్టీకి ఇస్తామనే విషయానికి కట్టుబడి ఉన్నామని కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ నేత, ఎమ్మెల్సీ మహమూద్అలీకి డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందనే ప్రచారం తెరాస వర్గాల్లో జరుగుతోంది.
ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు మజ్లీస్ మద్దతు తీసుకోవాల్సి వస్తే మాత్రం డిప్యూటీ సీఎం పదవి ఆ పార్టీకి కేటాయిస్తారని అంటున్నారు. అప్పుడు మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దళిత నేత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సభాపతి స్థానంలో దళిత నేతను కూర్చోబెట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications