స్పెషల్ స్టేటస్: కెసిఆర్‌తో ప్రత్యేకంగా మోడీ, ఏకరువు
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని ఆయన మోడీని కోరారు. తెలంగాణ సమస్యలు, నిధుల పైన చర్చించారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు పైన నివేదిక ఇచ్చారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మోడీతో కెసిఆర్, ఎంపీలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎంపీ జితెందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మోడీ తమకు మంచి సమయం ఇచ్చారని, అన్నింటిని సావధానంగా విన్నారని చెప్పారు. కెసిఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడారని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని మోడీ హామీ ఇచ్చారన్నారు. 14 అంశాల మీద మోడీకి తాము రిప్రజంటేషన్ ఇచ్చామన్నారు. కొత్త ప్రాజెక్టులు ఇవ్వాలని కోరామన్నారు. అలాగే నాలుగువేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఇవ్వాలని కోరారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలను కెసిఆర్ ప్రధానమంత్రికి పరిచయం చేశారు. మోడీతో భేటీలో చర్చించిన అంశాలను కెసిఆర్ ఆదివారం వివరించనున్నారు.
రుణమాఫీపై తగ్గం: పోచారం
రైతు రుణమాఫీ అంశంపై ఇబ్బందులను అధిగమించి అడుగు ముందుకు వేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రుణమాఫీపై వెనక్కు తగ్గేది లేదన్నారు.
హైదరాబాదులోని సచివాలయంలో అధికారులతో రైతుల రుణమాఫీపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని, రైతులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోచారం కోరారు.












Click it and Unblock the Notifications