ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు: కెసిఆర్
హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. తాను ఏది మాట్లాడినా పంచాయతీ అంటున్నారని, మీడియానే వివాదాలు సృష్టిస్తుందని, అయినా మాట్లాడక తప్పదని ఆయన అన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న బళ్లారి రాఘవ గురించి ప్రస్తావించే సమయంలో ఏదో నాటకాలు వేశాడట, అతనెవరు, రాఘవ మనకేం సంబంధం అని ఆయన అన్నారు.
తెలంగాణ మహాకవి దాశరథి జయంతి సభలో ఆయన మంగళవారంనాడు మాట్లాడారు. దాశరథి అచ్చమైన తెలంగాణ బిడ్డ అని ఆయన అన్నారు. దాశరథి జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని, అదే సమయంలో దుఖ్కం కూడా ఉందని, దాశరథికి గత ప్రభుత్వాల కాలంలో అవమానం జరిగిందని ఆయన అన్నారు. 27 ఏళ్లు దాశరథిని పట్టించుకోలేదని ఆయన అన్నారు.

దెబ్బలు తిన్నా తాను చెప్పదలుచుకున్న విషయంలో దాశరథి రాజీ పడలేదని కెసిఆర్ అన్నారు. దాశరిథి తమిరంతో సమరం చేశాడని అన్నారు. దాశరథి కుటుంబం ఇబ్బందిలో ఉండడం బాధాకరమని, ఆ కుటుంబానికి బాధలు లేకుండా చూస్తానని, దాశరథి కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ఆయన చెప్పారు.
దాశరథి స్మారక అవార్డును నెలకొల్పి ఏటా ఉత్తమ కమికి లక్షా నూట పదహార్ల నగదు బహుమతి ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని పదిలపరుచుకుంటున్న ఈ సమయంలో దాశరథి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ పని చేస్తామని ఆయన అన్నారు.
మాదే తెలుగు, మాదే సంస్కారం అనే వాళ్లు రవీంద్ర భారతికి అరకొర నిధులు ఇచ్చారని, రవీంద్ర భారతిని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి యేటా కోటి రూపాయలు ఇస్తామని, రేపే జీవో విడుదల చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని ఆకాశానికి ఎత్తుదామని, ఇంకా కూడా విమర్శిస్తే తమ వద్ద చాలా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ భాషను, సాహిత్యాన్ని, సంస్కారాన్ని వికసింపజేయాలని ఆయన సాహిత్యకారులకు సూచించారు.












Click it and Unblock the Notifications