పదవులపై తొందరొద్దు, బాబును ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాం: కేసీఆర్
హైదరాబాద్: రాజకీయాల్లో తొందరపాటు ఉండకూడదని, కొందరికి ముందుగానే పదవులు రావొచ్చునని, మరికొందరికి ఆలస్యంగా రావొచ్చునని ఎవరు తొందరపడవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. కొంపల్లిలో తెరాస విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. పదవుల కోసం ఎవరు తొందరపడవద్దన్నారు.
పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. ఏప్రిల్ 27న జరిగే పార్టీ వార్షికోత్సవానికి సన్నద్ధం కావాలన్నారు. అందరికీ కొన్ని సందర్భాల్లో పదవులు రావన్నారు. కొన్ని సందర్భాల్లో కొందరికి అనుకోకుండా పదవులు వస్తాయన్నారు. అలాంటప్పుడు తొందరపాటు నిర్ణయాలు వద్దన్నారు. అలా చేస్తే వారికి భవిష్యత్తు ఉండదన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఓ ఉదాహరణ చెప్పారు.
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన సామాన్య కార్యకర్త అనితను తాము 2001లో జెడ్పీటీసీకి పోటీ చేయమంటే ఎందుకన్నా అని అన్నారని, తాము బలవంతం చేస్తే గెలిచారని, ఆ తర్వాత కాంగ్రెస్ పొత్తులో భాగంగా కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్‌కు పోగా, నిజామాబాద్ మనకు వచ్చిందని, అది మహిళలకు రిజర్వ్ కావడంతో అప్పుడు అనిత జెడ్పీ చైర్మన్ అయ్యారన్నారు. అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, కులం, సామాజిక వర్గం.. తదితరాల నేపథ్యంలో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేయవలసి వస్తుందన్నారు. అప్పుడు పదవులు ఆలస్యం కావొచ్చన్నారు. కానీ ఆలస్యంగానైనా వస్తాయన్నారు. వాస్తవానికి తెరాస నిన్నటి వరకు రాజకీయ పార్టీ కాదని, ఇప్పుడు పక్కా రాజకీయ పార్టీ అన్నారు.
2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సమైక్యవాద చంద్రబాబు నాయుడును మట్టి కరిపించామన్నారు. తద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యామన్నారు. త్వరలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయన్నారు. తెలంగాణలో మరో పార్టీకి భవిష్యత్తు లేదన్నారు.
ప్రస్తుతం చాలా పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయన్నారు. వారు తమ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు అలా మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాదులో మంచి పారిశ్రామిక వాడను తయారు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రతి ముఖ్యమంత్రి రొటిన్‌గా వెళ్లారే తప్ప కొత్తగా ఆలోచించలేదన్నారు. పరిశ్రమల అభివృద్ధి కోసం తాను సర్వేలు చేశానని, కానీ కాంగ్రెస్ నేతలు తన పైన విమర్శలు గుప్పించారన్నారు.
హైదరాబాదులో సర్వేలు చేస్తే విమానంలో ప్రయాణం అన్నారని, వరంగల్‌లో పాదయాత్ర చేస్తే నడుస్తున్నారని విమర్సించారని, పైన వెళ్తే అలా, కింద నడిస్తే ఇలా అన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ ప్రకటన పైన తనకు నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. తెరాసతో బంగారు తెలంగాణ సాధ్యమన్నారు.
ఏప్రిల్ 24న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఏప్రిల్ 24వ తేదీన తెరాస రాష్ట్రస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఫిబ్రవరి 20లోపు పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్ 24న పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఏప్రిల్ 20వ తేదీ లోపు జిల్లాస్థాయి కమిటీలు పూర్తి చేస్తారు. తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలిగా తుల ఉమను ఎన్నుకున్నారు. రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్నికయ్యారు. కాగా, ఉప ముఖ్యమంత్రి రాజయ్య సమావేశానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications