కిరణ్ రెడ్డిని గుర్తు చేసిన కేసీఆర్, బాబు చుట్టొద్దు: టాలీవుడ్‌కు తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన పరోక్ష విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు రవీంద్ర భారతిలో జరిగిన మేడే ఉత్సవంలో కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు.
తెలంగాణ వస్తే కరెంటు లేక ఆగమైతదని ఓ మాజీ ముఖ్యమంత్రి చెప్పారని, ఆ మాజీ సీఎం కట్టె పట్టుకొని మ్యాపులపై బొమ్మలు చూపించారని కిరణ్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి నుంచి వ్యవసాయానికి పగటి పూట కరెంటు ఇస్తామన్నారు.
పరిశ్రమలకు కరెంటు కోతలుండవని, నిరభ్యంతరంగా పరిశ్రమలు పెట్టుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. తాము చేపట్టిన పథకాలు చెప్పారు.
తెలంగాణలో ఉన్న డ్రైవర్లకు ప్రమాద బీమా, హోంగార్డులకు, జర్నలిస్టులకు ప్రమాద బీమా ఈరోజు నుండి వర్తిస్తుందన్నారు. ప్రసూతి సమయంలో చేసే ఆర్థిక సాయం రూ.10వేల నుండి రూ.20వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఆటో రిక్షాలకు పన్నులు రద్దు చేశామని చెప్పారు. ఉన్న బకాయిలు రద్దు చేశామన్నారు. బీడీ కార్మికులకు నెలకు రూ.1000 భృతి ఇస్తున్నామన్నారు.

చంద్రబాబు చుట్టూ తిరగడం మానుకోండి: తలసాని
టాలీవుడ్లో పలువురు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నారని, అది మానుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మేడే సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
నైపుణ్యం ఉంటే సినీ పరిశ్రమలో రాణించవచ్చునన్నారు. సినీ పరీశ్రమలో ఉన్న విధానాలు మారుస్తామన్నారు. తెలుగు సినీ నటులు తమను ఉబ్బంది పెట్టకుండా ఉంటే, తాము కూడా బాగా చూసుకుంటామన్నారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులోనే ఉంటుందన్నారు. ఇక నుండి చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా పని ఉండదన్నారు.












Click it and Unblock the Notifications