ప్రాణం అడ్డేశా, బాధతో: సభలో కేసీఆర్ ఉద్వేగం, ఆవేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు శాసన సభలో ఉద్వేగంగా, కొంత ఆవేశంగా మాట్లాడారు. డీఎల్ఎఫ్ భూముల పైన కేసీఆర్ వివరణ ఇచ్చే సమయంలో విపక్షాల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరైనా సభ్యులు తీవ్ర ఆరోపణలు చేసి, వాటిని నిరూపించలేకుంటే వారిని సభ నుండి పంపించాలన్నారు.
డీఎల్ఎఫ్ రూ.580 కోట్లతో 31.31 ఎకరాలు కొనుగోలు చేసిందని చెప్పారు. శేరిలింగంపల్లిలో 471 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయించారన్నారు. ఏపీఐఐసీ కొంత భూమిని విక్రయించి నిధులను ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు తన పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధతో చెబుతున్నా

తాను ఈ మాటలు బాధతో చెబుతున్నానని తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన భూములతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొందరు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారన్నారు. ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందని ప్రశ్నించారు. తన పైన ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు.
నా ప్రాణాలు అడ్డుపెట్టా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ప్రాణాలు ఫణంగా పెట్టానని కేసీఆర్ అన్నారు. తాము చిత్తశుద్ధితో రాష్ట్రం కోసం పోరాడామని, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే పదవులకు రాజీనామాలు చేసి త్యాగం చేశామన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘంగా పోరాడామన్నారు. దీనిని ఎన్నో శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు.
తాము అధికారంలోకి వట్టిగానే రాలేదన్నారు. దొంగచాటుగా రాలేదన్నారు. ప్రజలు తమను గెలిపించారన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి దొర వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. సద్విమర్శలు చేస్తే తాము స్వీకరిస్తామన్నారు. కానీ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
గతంలో పెత్తనం చేసి, ఇప్పుడు కోల్పోయిన వారు, రాష్ట్రం అభివృద్ధిని సహించలేని వారు, ఎంగిలి మెతుకులకు ఆశపడే వారు తమ పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అధికారం శాశ్వతం కాదు
అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు. తన కుటుంబాన్ని, తనను బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భూ బదలాయింపుల పైన తన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలోనే భూములను అప్పనంగా అప్పగించారనే విమర్శలు ఉన్నాయన్నారు. పదవులు వస్తాయి... పోతాయి.. ఏదీ శాశ్వతం కాదన్నారు. సభ్యులు సంస్కారవంతంగా మాట్లాడాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే భూకేటాయింపులు జరిగాయన్నారు. భూములను దొర ఇంకొక దొరకు రాసిచ్చాడని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. ఎవరైనా సభ్యులు ఆరోపణలు రుజువు చేయకుంటే వారిని సభ నుండి పంపించి వేయాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉనికిని సహించలేని వారు విమర్శలు చేస్తున్నారన్నారు.
సమైక్య పాలనలో కోట్లాది రూపాయల తెలంగాణ భూములను తెగనమ్మారన్నారు. తాడు బొంగరం లేకుండా గేమింగ్ సిటీకి ప్లాన్ చేశారన్నారు. ఏపీఐఐసీ నుండి వేర్వేరు సంస్థలు భూములు తీసుకున్నాయని తెలిపారు. మైహోం నేత వందల కోట్ల రూపాయలు పెట్టి భూమి కొన్నారన్నారు. మైం హోం సంస్థ దక్షిణ భారత దేశంలోనే సిక్స్ స్టార్స్ ఉన్న సంస్థ అన్నారు. వాస్తవాలు చెబుతుంటే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
రామేశ్వర రావును బ్లాక్ మెయిల్ చేశారు
పారిశ్రామికవేత్తలను సతాయించడం సరికాదన్నారు. మై హోం రామేశ్వర రావును బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడిగిన వాళ్లు ఉన్నారని, ఆయన డబ్బులిచ్చేందుకు నిరాకరించారన్నారు. పారిశ్రామికవేత్తలను ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే భయపడవద్దని పిలుపునిచ్చారు.
ఫడ్నవీస్ సస్పెండ్ చేశారు
ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసే వారు చెప్పే వాటిని కొన్ని టీవీలు, పత్రికలు అదే పనిగా ఇచ్చాయన్నారు. ఎవరైనా ఆరోపణలు చేయవచ్చునని కానీ, వాటిని రుజువు చేయాలని, లేదంటే వారి పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. మహారాష్ట్రలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు గవర్నర్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే, కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వారిని రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారన్నారు. సీఎంను ఉద్దేశించి దొర అని వ్యాఖ్యానిస్తారా అన్నారు.
తెలంగాణలో సిమెంట్ ధర రూ.230 ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 ఉందని, దాని గురించి తాము ఎప్పుడు అడగలేదన్నారు. తమ పైన చేసే ఆరోపణలతో తెలంగాణ ప్రతిష్టను ఎవరు ఆపలేరన్నారు. తాను సింగిల్ విండో చైర్మన్ నుండి కేంద్రం దాకా ఎదిగానన్నారు. తాను ఎవరో నామినేట్ చేస్తే రాలేదన్నారు. ఆరోపణలు వద్దని, ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు సభను ఇంకో 20 రోజులు కాదు.. నలభై రోజులు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications