హెలికాప్టర్ ద్వారా కెసిఆర్ ప్రచారం, విజయశాంతికి ఆర్డర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు హెలికాప్టర్ ద్వారా ప్రచారం చేయనున్నారు. కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ సిద్ధమైంది. పార్టీ అద్దెకు తీసుకున్న హెలికాప్టర్ గురువారం పార్టీ స్వాధీనంలోకి వచ్చింది. దీంట్లోనే కెసిఆర్, తన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామశివారులోని తన ఫాంహౌస్‌కు వెళ్లారు.
బేగంపేట నుంచి కెసిఆర్ హెలికాప్టర్‌లో ఫాంహౌస్‌కు చేరుకోవడానికి 18 నిమిషాలు పట్టింది. కాగా, ఎన్నికల ప్రచారాన్ని ఫాంహౌస్ కేంద్రంగానే సాగించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు, ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే ఎదురయ్యే ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలుత, ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్ కోసం శంషాబాద్, దుండిగల్, హకీంపేట విమానాశ్రయాలతో సమన్వయం చేసుకోవాల్సి రావడం తదితర కారణాలతో కెసిఆర్ ఫాంహౌస్ నుంచే ప్రచారం చేయడానికి మొగ్గుచూపుతున్నారట. ఏప్రిల్ 28 వరకు హెలికాప్టర్ తెరాస పార్టీ స్వాధీనంలో ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున విజయశాంతి
తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ తరఫున రాబోయే ఎన్నికలలో ప్రచారం చేసేందుకు మెదక్ ఎంపి విజయశాంతి సిద్ధమవుతున్నారు. కాంగ్రెసు తరఫున తెలంగాణవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొనాలని, పార్టీ ఏర్పాటు చేసే సభలకు హాజరు కావాలని ఆమెను అధిష్టానం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఆమె ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కెసిఆర్ లోకసభకు మెదక్ నుండి పోటీ చేసే పక్షంలో తాను కూడా అదే లోకసభ స్థానం పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. లేదంటే శాసన సభకు వెళ్లాలని యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications