అమరావతి కేంద్రంగా బీఆర్ఎస్ కీలక నిర్ణయం..!!
ఏపీలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయానికి సిద్దమైంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది. వైసీపీ తిరిగి అధికారంలోకి రావటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో ఏపీలో ఎంట్రీ ఇస్తున్న బీఆర్ఎస్ కొత్త లెక్కలతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. రాజధానితో పాటుగా ఏపీలోని కీలక అంశాల పైన సర్వేలు చేయిస్తోంది. మెజార్టీ ప్రజాభిప్రాయమే పార్టీ నిర్ణయంగా చెప్పేందుకు సిద్దం అవుతోంది. అదే సమయంలో ఏపీలో తమ పార్టీ వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కేసీఆర్ ఏపీ పర్యటన ద్వారా అధికారికంగా అన్నింటి పైనా ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది.
ఏపీలో బీఆర్ఎస్ భారీ అంచనాలతో కనిపిస్తోంది. సీనియర్ రాజకీయ నేతలు తమ పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే మూడు రీజియన్లకు చెందిన నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని స్థానాల్లోనూ పోటీకి సిద్దమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో కీలకంగా మారిన రాజధాని వ్యవహారం పైన బీఆర్ఎస్ స్పష్టతతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి రాజధాని నగర శంకుస్థాపనకు ప్రధాని మోదీతో పాటుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న తోట చంద్ర శేఖర్.. రావెల కిషోర్ బాబు వంటి నేతలు తమ పార్టీ అమరావతికే మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు.

రాజధానితో పాటుగా ఏపీలో కీలక అంశాల పైన స్వయంగా కేసీఆర్ స్పందిస్తారని చెబుతున్నారు. మార్చి రెండో వారంలో తెలంగాణ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏపీ పర్యటన ఉంటుందని
సమాచారం. ఆ సమయంలో పార్టీ నిర్ణయాలతో పాటుగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ఇక..ఏపీలో తమ పార్టీ వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేంద్రంగా ఒక పత్రికను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కోసం పని చేస్తున్న నమస్తే తెలంగాణ తరహలోనే నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీని ద్వారా ఏపీలో పార్టీకి ప్రచారంతో పాటుగా.. ప్రజలకు దగ్గరయ్యేందుకు వారధిగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నిర్ణయాల పైన కేసీఆర్ ఏపీ పర్యటన సమయంలో స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications