మళ్లీ మొదలు: బిజెపితో కయ్యానికి కాలు దువ్విన కెఈ
కర్నూలు: మిత్రపక్షాలైన తెలుగుదేశం, బిజెపిల మధ్య మాటల యుద్ధం రాజుకునేట్లుంది. ఈ సమరానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణ మూర్తి తెర లేపారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. కర్నూలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
"ప్రత్యేక హోదా, రైల్వేజోన్ గురించి మేము ఎంతగా అడుగుతున్నప్పటికీ కేంద్రం ఏవో సాకులు చెపుతూ తప్పించుకుంటోంది. అవి అసలు అవసరమే లేదన్నట్లుగా మాట్లాడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తానని చెపుతోంది కానీ అందుకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేసిన రూ.5,000 కోట్లు తిరిగి ఇవ్వడం లేదు. ఇకనైనా రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం వైఖరి మారితే అందరికీ మంచిది" అని కెఈ అన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వబోమని గతంలో కేంద్ర మంత్రులు చెప్పిన సమయంలో టిడిపి, బిజెపిల మధ్య వార్ నడిచింది. అయితే, రైల్వే మంత్రి సురేష్ ప్రభును తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు ఎంపిక చేయడంతో ఇరు పార్టీల మధ్య సయోధ్య నెలకొన్నట్లు కనిపించింది. అయితే, తాజాగా కెఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలు గమనిస్తే పరిస్థితి అంత సజావుగా లేదని తోస్తోంది.
కెఈ కృష్ణ మూర్తి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మరో మంత్రి అచ్చెన్నాయుడు పక్కనే ఉన్నారు. అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. అయినా, ఆయన కెఈ మాటలపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. దాంతో కెఈ వ్యాఖ్యలకు ఆయన ఆమోదం కూడా ఉందనే భావన కలుగుోతంది. కెఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలతో బిజెపి, టిడిపిల మధ్య చిచ్చు తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications