నగరిలో డేంజర్ బెల్స్ - ఏం జరుగుతోంది..!!
ఏపీలో కొన్నికీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. రోజాకు సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి ఉంది. రోజా నామినేషన్ దాఖలు సమయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నగరి గడ్డా రోజా అడ్డాగా చెప్పుకొచ్చారు. అయితే, సొంత నియోజకవర్గ నేతలు తక్కువగా కనిపించారు. దీంతో.. నగరిలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
నగరిలో ఏం జరుగుతోంది
మంత్రి రోజా హ్యాట్రిక్ విజయం దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చ. రోజా రెండో సారి విజయం సాదించిన సమయం నుంచి అసమ్మతి వెంటాడుతోంది. నగరి మున్సిపల్ ఎన్నికల్లో మొదలైన విభేదాలు అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి తారాస్థాయికి చేరుకున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కారు. 2014లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుతో తలపడ్డారు. 871 ఓట్ల తేడాతో హమ్మయ్యా అని బయటపడ్డారు. 2019లో ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్‌రెడ్డిపై పోటీచేసి 2,007 ఓట్లు తేడాతో గెలుపొందారు. వైసిపి అధికారంలోకి రావడంతో రోజా దశ తిరిగింది. ఎపిఐఐసి ఛైర్మన్‌గానూ, క్రీడా, టూరిజం శాఖ మంత్రిగానూ పనిచేశారు.

మారుతున్న లెక్కలు
ప్రస్తుతం నియోజకవర్గంలో ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి బరిలో ఉన్నారు. అతనికి బంధువర్గం నగరి, పుత్తూరులో ఎక్కువగా ఉంది. అలాగే రోజా గెలుపునకు కృషి చేసిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి, జడ్‌పిటిసి మురళీనాథరెడ్డి తమ సపోర్టు గాలి భానుప్రకాష్‌కే అని పరోక్షంగా ప్రకటించారు. అమ్ములు, వెంకటముని, లకీëపతి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. పుత్తూరు, నగరి, విజయపురం, వడమాలపేట, నిండ్ర మండలాలు ఉండగా, మంత్రి రోజాకు గత ఎన్నికల్లో వడమాలపేట, నిండ్ర ఓట్లే ఎక్కువ మెజార్టీని తెచ్చాయి. దీంతో అప్పట్లో గట్టెక్కారు. అయితే ఈసారి అసమ్మతి సెగ ఈ మండలాల్లో ఎక్కువగా ఉంది. రెండు ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీనే రావటంతో ఆ సారి లెక్కలు మారుతున్నాయి.
హ్యాట్రిక్ పై రోజా ధీమా
నగరిలోని అసమ్మత్తి నేతలు గత నాలుగైదు నెలలుగా 'జగన్‌ను గెలిపిస్తాం.. రోజాకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతాం' అంటూ అసమ్మతి వర్గం బహిరంగంగానే ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చింది. రోజాకు వ్యతిరేకంగా ధర్నాలు సైతం చేపట్టారు. ఓ దశలో రోజాకు టికెట్ డౌటేనని చర్చ నడిచింది. ఎట్టకేలకు రోజాకు టికెట్ లభించింది. వైసీపీలో అంతర్గత కలహాలు, అసమ్మతి తనకు కలిసి వస్తుందని టీడీపీ అభ్యర్ది భానుప్రకాశ్ ఆశలు పెట్టుకున్నారు. అసమ్మతి నేతలుగా గుర్తింపు ఉన్న వారికి పదవులు దక్కాయి. రోజా మంత్రి తాను హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..నగరిలో ఎన్నికల ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications