కేశినేని చిన్ని దూకుడు వెనుక - హామీ దక్కిందా, ఏం జరుగుతోంది..!!
విజయవాడ రాజకీయంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు తమ వ్యూహాలతో అలర్ట్ అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న సమయం లో అభ్యర్ధులు వేగంగా అడుగులు వేస్తున్నారు. విజయవాడ టీడీపీలో ఇప్పుడు కేశినేని చిన్ని వరుసగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు...నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి. చిన్ని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఖరారయ్యారని చెబుతున్నారు. ఏం జరుగుతోంది.
సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి : విజయవాడలో టీడీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో 2019లో వైసీపీ విజయవాడ లోక్ సభతో పాటుగా రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఈ సారి టీడీపీ, జనసేనతో పొత్తు వేళ టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. విజయవాడ లోక్ సభ పరిధిలో పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేశినేని చిన్ని లోక్ సభ అభ్యర్ధిగా టీడీపీ నుంచి ఖరారైందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.

ఇదే సమయంలో ఇప్పుడు చిన్ని ఇప్పుడు వరుసగా సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాన్యులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్ధిత్వం పైన హామీ వచ్చిన తరువాతనే చిన్ని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. టీడీపీ నేతలు చిన్ని నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుల్లో పాల్గొంటున్నారు.
సీటు ఖరారైందని ప్రచారం : కొద్ది రోజుల క్రితం స్కిల్ డెవల్మెంట్ పైన చిన్ని శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇప్పుడు వన్ టౌన్ చిట్టినగర్ మోతీ మసీద్ గ్రౌండ్ లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసారు. క్యాంపుకు హాజరైన వ్రుద్దులు.. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ క్యాంపు ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని చిన్ని ఆరోపించారు.
పేదలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందటం లేదన్నారు. ప్రతీ పేదవాడికి వైద్యం అందించాలనే ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆరోగ్య పరంగా భరోసా ఇవ్వాలనేది తమ లక్ష్యమన్నారు.

టీడీపీలో మారుతున్న సమీకరణాలు : ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసివేసిందని చిన్ని ఆరోపించారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు మొబైల్ క్యాంటీన్స్ ద్వారా అన్నం అందిస్తున్నామని వివరించారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ప్రకటించారు.
ఇలా సేవా కార్యక్రమాల ద్వారా కేశినేని చిన్ని పార్టీ నేతలతో కలిసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల పైన ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో చిన్నికి పార్టీ సీటు ఖరారు కావటంతోనే స్పీడు పెంచారనే చర్చ జరుగుతోంది. విజయవాడ పరిధిలో ఇప్పుడు ఈ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications