పవన్ కళ్యాణ్‌కు నాపై ప్రేమ ఎక్కువ అందుకే: కేశినేని చమత్కారం, చిరంజీవితో..
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తన పైన ద్వేషం లేదని, ఎంతో ప్రేమ ఉందని విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తన పైన ద్వేషం లేదని, ఎంతో ప్రేమ ఉందని విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
పవన్‌కు తామంటే ఎలాంటి ద్వేషం లేదన్నారు. మరి.. ఆంధ్రా ఎంపీలకు ఇంగ్లీషు రాదని, అందుకే హోదా గురించి అడగలేకపోతున్నారని ఆయన చెబుతున్నారు కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ప్రేమ ఎక్కువైనా అలాగే మాట్లాడుతారని చమత్కరించారు.
తనకు ఇంగ్లీష్, హిందీ వస్తుందని, ఈ విషయం తన గురించి తెలిసిన వారందరికీ తెలుసునని చెప్పారు. పవన్, తాను ఎప్పుడు నేరుగా మాట్లాడుకోలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ మంచి రాజకీయ నాయకులకే మద్దతిస్తారని తాను భావిస్తున్నానని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా మంచి నాయకుడని, అందుకే పవన్ కళ్యాణ్ 2014లో మద్దతు పలికారని, ఎల్పప్పుడు కూడా అలాగే మద్దతిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. పవన్‌తో మాట్లాడలేదని, చిరంజీవితో మాత్రం ఎదురు పడినప్పుడు మాట్లాడనని చెప్పారు.
కాగా, గతంలో ప్రత్యేక హోదా విషయమై పవన్ టిడిపి ఎంపీలను నిలదీశారు. ప్రత్యేకంగా కేశినేని నానిని టార్గెట్ చేశారు. అప్పుడు కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. ఇతర ఎంపీలు కూడా తీవ్రంగానే స్పందించారు. కానీ చంద్రబాబు హెచ్చరికలతో వెనక్కి తగ్గారు.
పవన్‌తో దూరం పెంచుకోవద్దని చంద్రబాబు చూస్తున్నారు. ఇందులో భాగంగానే సమస్యల పైన ఆయన చేసే సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం స్పందించడంపై పవన్ కూడా ధన్యవాదాలు చెబుతున్నారు. తాజాగా, కేశినేని నాని వ్యాఖ్యలతో పవన్‌ను దూరం చేసుకోవద్దని టిడిపి బలంగా భావించినట్లుగా మరోసారి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications