టీడీపీతో పొత్తు దెబ్బ- వైసీపీలో జనసేన నేత
నెల్లూరు: ఊహించినట్టే- జనసేన సీనియర్ నాయకుడు, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి చేతుల మీదుగా కండువాను కప్పుకొన్నారు. జనసేనకు గుడ్‌బై చెప్పిన మరుసటి రోజే కేతంరెడ్డి.. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకొన్నారు.
రెండు రోజుల కిందటే ఆయన జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాష్ట్ర విభజన తరువాత జనసేనలో ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించారు.

ఇటీవలే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారాయణను అభ్యర్థిగా ప్రకటించిందని, అప్పటికీ జనసేన- టీడీపీ మధ్య పొత్తు లేదని కేతంరెడ్డి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటును ఆశించవద్దని, టీడీపీ తరఫున నారాయణ పోటీ చేస్తారని, ఆయన గెలుపు కోసమే పని చేయాలని సీనియర్ నాయకులు ఆదేశించారని చెప్పారు.
2016లో తాను సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే ఈ నారాయణ అక్రమాల మీదేనని, అలాంటి వ్యక్తిని గెలిపించడానికి తాను పనిచేయలేనని తేల్చి చెప్పారు కేంతరెడ్డి. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా నారాయణ అక్రమాల మీద బలంగా తన గళాన్ని వినిపించానని చెప్పారు.
ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవమానాలను భరిస్తూ ఉండలేనని, ఓర్పు, సహనం నశించిందని, మనస్సు చచ్చిపోయిందని కేతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నన్ని రోజులు నీతి, నిబద్ధతతో జనసేన పార్టీ కోసం పని చేశానని, ఇప్పుడు నారాయణను గెలిపించాలనే విషయాన్ని మనస్సులో పెట్టుకుని పని చేయలేనని, అలా చేస్తే అది రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని తేల్చి చెప్పారు.

అందుకే అన్ని కోణాల్లో అలోచించి, కార్యకర్తలతో చర్చించి జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. నమ్ముకున్న ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని భరోసాగా నిలిచే వారితోనే తన మున్ముందు ప్రయాణం ఉండబోతోందని కేతంరెడ్డి వివరించారు. దీనికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీలో చేరారు.
కేతంరెడ్డి వెంట ఆయన అనుచరులు, జనసేన కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, వీరమహిళలు, వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications