టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలంటూ జనసేన ఆదేశాలు: బిగ్ వికెట్ అవుట్: రాజీనామా లేఖ
నెల్లూరు: ఊహించిందే జరిగింది. జనసేన సీనియర్ నాయకుడు, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు. సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.
2003లో విద్యార్థి నేతగా కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణం మొదలైందని, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు. ఆనం వివేకానందరెడ్డి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌ను వీడానని, యువతకు ప్రాధాన్యత కల్పిస్తానంటూ నమ్మించిన పవన్ కళ్యాణ్ ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై జనసేన పార్టీలో చేరానని చెప్పారు.

పార్టీలో చేరినప్పటి నుంచి నిబద్ధత గల జనసైనికుడిగా పనిచేశానని, జనసేన జనంలోకి తీసుకెళ్లానని కేతంరెడ్డి చెప్పారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని పవన్ కల్యాణ్ కల్పించారని వివరించారు. ఆ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని, పార్టీ కోసం నిత్యశ్రామికుడిలా కృషి చేశానని అన్నారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్టీ పరంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకుండా, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా, తగిన విలువ ఇవ్వకుండా ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా పంటి బిగువున భరించానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో పవన్ కళ్యాణ్ ఎదుటే కన్నీటి పర్యంతం అయ్యాననీ అన్నారు.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే, ఆయనతో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించితే ప్రజలకు మరింతగా సేవ చేయగలిగే అవకాశం వస్తుందనే భావనతోనే ఇన్ని రోజులు జనసేనలో ఉండగలిగానని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనే సింగిల్ పాయింట్ అజండాతో 316 రోజుల పాటు నెల్లూరు సిటీలో పవనన్న ప్రజాబాట చేశానని చెప్పారు.
ఇటీవలే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారాయణను అభ్యర్థిగా ప్రకటించిందని, అప్పటికీ జనసేన- టీడీపీ మధ్య పొత్తు లేదని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటును ఆశించవద్దని, టీడీపీ తరఫున నారాయణ పోటీ చేస్తారని, ఆయన గెలుపు కోసమే పని చేయాలని సీనియర్ నాయకులు ఆదేశించారని చెప్పారు.
2016లో తాను సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే ఈ నారాయణ అక్రమాల మీదేనని, అలాంటి వ్యక్తిని గెలిపించడానికి తాను పనిచేయలేనని తేల్చి చెప్పారు కేంతరెడ్డి. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా నారాయణ అక్రమాల మీద బలంగా తన గళాన్ని వినిపించానని చెప్పారు.
రాజకీయాల్లో హత్యలుండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయని, ఇన్ని రోజులు పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా ఆత్మాభిమానాన్ని చంపుకొని పని చేశానంటే అది పవన్ కళ్యాణ్ ఉన్నారనే ధైర్యంతోనేనని అన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవమానాలను భరిస్తూ ఉండలేనని, ఓర్పు, సహనం నశించిందని, మనస్సు చచ్చిపోయిందని కేతంరెడ్డి వాపోయారు.
ఉన్నన్ని రోజులు నీతి, నిబద్ధతతో జనసేన పార్టీ కోసం పని చేశానని, ఇప్పుడు నారాయణను గెలిపించాలనే విషయాన్ని మనస్సులో పెట్టుకుని పని చేయలేనని, అలా చేస్తే అది రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని తేల్చిచెప్పారు. అందుకే అన్ని కోణాల్లో అలోచించి, కార్యకర్తలతో చర్చించి జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
నమ్ముకున్న ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని భరోసాగా నిలిచే వారితోనే తన మున్ముందు ప్రయాణం ఉండబోతోందని వివరించారు కేతంరెడ్డి. రాజకీయంగా తాను ఏ పార్టీలో ఉన్నా కూడా నీతి, నిబద్ధత తప్పనని, తనను ఆదరించే ప్రజలకు, ఇప్పటివరకు తోడుగా నిలిచిన జనసైనికులకు ఏ కష్టమొచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications