పవన్‌ను మింగేస్తోన్న బ్లాక్ హోల్..!!
నెల్లూరు: జనసేనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. జనసేన పార్టీలో తాను పవన్ కళ్యాణ్ అనే ఒక్క వ్యక్తి కోసమే తాను పనిచేశానని, ఆయన చుట్టూ వెధవలు ఉన్నారని ఆరోపించారు. వాళ్లంతా పవన్‌ను పక్కదారి పట్టిస్తోన్నారని విమర్శించారు.
జనసేన నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జీగా పని చేసిన కేతంరెడ్డి ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఈ ఉదయం నెల్లూరు వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జనసేనలో తాను ఎదుర్కొన్న అవమానాలను వివరివంచారు.

జనసేనలో నెంబర్ 2గా గుర్తింపుపొందిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఖరిని తప్పుపట్టారు. నిత్యం తనపై కుట్రలు చేస్తూ, పవన్ కళ్యాణ్‌కు లేనిపోనివి ఫిర్యాదులు చేసే వారని, పార్టీ కార్యక్రమాలకు కూడా తనను పిలవకుండా అవమాన పరిచేవారని ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ తనను తాను ఆకాశం లాంటివాడిని తరచూ చెబుతుంటారని, నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్.. ఆయనను మింగేస్తోందని విమర్శించారు. ఈ నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్ పార్టీలో ఎవ్వరినీ ఎదగనీయదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా డమ్మీ కమిటీలను వేసి ఇదే జనసేన పార్టీ అంటారని, కష్టపడి పనిచేసే వారికి అసలు గుర్తింపు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను యూత్ కాంగ్రెస్‌కు సోషల్ మీడియా ఛైర్మన్‌గా, రాష్ట్ర ఇన్ ఛార్జ్‌గా ఉన్న సమయంలో నాదెండ్ల మనోహర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఛైర్మన్‌గా ఉండేవారని, ఆయన ఎలాంటి వాడనేది చాలా దగ్గరి నుంచి చూశానని కేతంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ దివాళా తీసే పరిస్థితికి చేరిందంటే దానికి కారణం నాదెండ్లేనని తేల్చి చెప్పారు.

తెనాలిలో పోటీ చేయకుండా ఆ సీటును తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసి నాదెండ్ల మనోహర్ తన నిబద్ధత నిరూపించుకోవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ గతంలో టీడీపీని తిట్టారని, ఇప్పుడు టీడీపీ మనిషిగా కనిపిస్తోన్నాడని కేతంరెడ్డి విమర్శించారు. టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తోన్నారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం పేద ప్రజల ఆర్ధిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కేతంరెడ్డి ప్రశంసించారు. పవనన్న ప్రజాబాట పేరుతో తాను ఇంటింటికీ వెళ్లిన సమయంలో అనేక ఇళ్లల్లో వైఎస్ జగన్ ఫోటో పెట్టుకుని ఆరాధించడం స్వయంగా చూశానని వివరించారు. ఎలాంటి సమస్యలనైనా తాను సంబంధిత సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్తే అవి వెంటనే పరిష్కారం అయ్యాయని చెప్పారు.












Click it and Unblock the Notifications