పార్టీ మార్పుపై తేల్చేసిన కేతిరెడ్డి - వైసీపీ వీడే వారి జాబితా ఇదే..!!
వైసీపీని సీనియర్లు వీడుతున్నారు. వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. బాలినేని, సామినేని బాటలోనే మరి కొందరు ఉన్నారు. వీరిలో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయి. జగన్ కు సన్నిహితంగా ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ మారుతున్నారనే ప్రచారం పైన కేతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన లక్ష్యం స్పష్టం చేసారు.
పార్టీ వీడుతున్న సీనియర్లు
ఎన్నికల్లో ఓటమితో వైసీపీని సీనియర్ నేతలు వీడుతున్నారు. 11 సీట్లకే పరిమితం కావటం...పార్టీలో పరిణామాల కారణంగా వీరంతా పార్టీ వీడాలనే నిర్ణయాని కి వచ్చారు. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న ఆళ్ల నాని, బాలినేని, సామినేని పార్టీ వీడారు. మరి కొందరు ఇదే ఆలోచనలో ఉన్నారు. పార్టీ లోని కాపు నేతలు మాత్రం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ మాజీ మంత్రులు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు.

జాబితాలో నెక్స్ట్ ఎవరు
రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీదా మస్తాన రావు సైతం ఇప్పటికే పార్టీ వీడారు. తాజా జాబితాలో తూర్పు గోదావరికి చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్ను జనసేనలోకి తీసుకెళ్లేందుకు సామినేని ఉదయభాను ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేరు లిస్టులో ఉంది. ఇక..పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా పార్టీ వీడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
తేల్చేసిన కేతిరెడ్డి
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సైతం వైసీపీ వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది. దీని పైన ఆయన స్పందించారు. తాను పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తాను పార్టీ ఓటమికి కారణాలపై తన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించానని చెప్పుకొచ్చారు. జగన్ నాయకత్వం పైన తనకు విశ్వాసం ఉందన్నారు. వైసీపీలో ముఖ్య నేతలతో కూటమి పార్టీల ముఖ్యులు టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..దసరా వేళ మరి కొందర ముఖ్యులు పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications