గుండె హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదాన్ని ముందే ఎలా పసిగట్టాలి? లైఫ్ సేవింగ్ ఏఐ టెక్నాలజీ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా సంభవించే 'సడన్ కార్డియాక్ అరెస్ట్' (గుండె హఠాత్తుగా ఆగిపోవడం) ఎందరినో బలితీసుకుంటోంది. ల్యాబ్ పరీక్షల్లో గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా, మైదానంలో క్రీడాకారులు సైతం దీని బారిన పడుతున్నారు. ఈ ప్రాణాంతక ముప్పును ముందే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పుడు కృత్రిమ మేధ (AI) సాయంతో ఒక సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు.
ఈసీజీతోనే గుండెపోటు గుర్తించవచ్చా ?
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యూసీ) బెర్క్లీ పరిశోధకులు సాధారణ ఈసీజీ (ECG) పరీక్షల ద్వారానే సడన్ కార్డియాక్ అరెస్ట్ ముప్పును ముందే గుర్తించే సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ఈసీజీ నివేదికల్లో వైద్యుల కంటికి కనిపించని కొన్ని రహస్య తరంగాల (waveform patterns) నమూనాలను ఏఐ సాంకేతికత అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించింది. ఇప్పటివరకు వైద్య ప్రపంచానికి తెలియని ఒక జీవసంబంధిత సంకేతాన్ని ఈ ఏఐ సాంకేతికత వెలికితీయడం గమనార్హం.

వైద్య రంగంలో సరికొత్త విప్లవం
ప్రస్తుతం గుండె పనితీరును అంచనా వేయడానికి వైద్యులు ప్రధానంగా 'లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్' (LVEF) విధానంపై ఆధారపడుతున్నారు. అయితే, గుండె రక్తాన్ని పంపింగ్ చేసే విధానం సాధారణంగా ఉన్నప్పటికీ, విద్యుత్ వ్యవస్థలో లోపాల వల్ల హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరీక్షల ద్వారా చాలా మంది బాధితులను ముందుగా గుర్తించలేకపోతున్నారు. ఈ లోపాన్ని అధిగమించేందుకు పరిశోధకులు దాదాపు పదేళ్ల పాటు శ్రమించి ఈ సరికొత్త ఆవిష్కరణను చేశారు. ఈ పరిశోధన కోసం స్వీడన్‌కు చెందిన సుమారు 4.4 లక్షల మంది ఈసీజీ డేటాను, వారి మరణ ధృవీకరణ పత్రాలతో అనుసంధానం చేసి ఏఐకి శిక్షణ ఇచ్చారు. దీని ద్వారా భవిష్యత్తులో హఠాన్మరణం పొందే అవకాశం ఉన్న శాతాన్ని ఏఐ లెక్కగట్టింది. ఈ పద్ధతిని అమెరికా, తైవాన్ దేశాల రోగుల డేటాతో కూడా సరిపోల్చి చూసి నిర్ధారించుకున్నారు. సాంప్రదాయ పద్ధతుల కంటే ఈ ఏఐ సాంకేతికత ఎంతో మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు నిరూపించారు.

ప్రస్తుత నాణ్యతా ప్రమాణాల ప్రకారం గుండె సమస్యల ముప్పు 4.6 శాతంగా ఉంటే, ఈ ఏఐ టూల్ ఏకంగా 7 శాతం ముప్పు ఉన్న అత్యంత ప్రమాదకర స్థితిలోని రోగులను గుర్తించగలిగింది. ముఖ్యంగా ప్రస్తుత వైద్య పరీక్షల్లో తప్పిపోయిన 86 శాతం మంది హైరిస్క్ రోగులను ఈ ఏఐ సులభంగా పసిగట్టింది. ఇది ప్రాణాలను రక్షించే ఐసీడీ (ఇంప్లాంటబుల్ డెఫిబ్రిలేటర్) పరికరాలను సరైన సమయంలో రోగులకు అమర్చడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఏఐ కేవలం ముప్పును మాత్రమే హెచ్చరిస్తుందని, దీని ఆధారంగా వెంటనే గుండె ఆపరేషన్లు అవసరం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే, ముప్పు పొంచి ఉన్నట్లు ఏఐ సూచించిన రోగులకు ముందస్తుగా మరిన్ని అధునాతన వైద్య పరీక్షలు నిర్వహించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. ఈ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుంది.














Click it and Unblock the Notifications