వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!
హిందూ సంప్రదాయంలో తులసికి అత్యంత పవిత్ర స్థానం ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి కోట ఉండటం ఒక ఆనవాయితీగా వస్తోంది. తులసి మొక్క ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని, అక్కడ ఎప్పుడూ సానుకూల శక్తి ప్రసరిస్తుందని విశ్వసిస్తారు. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఉంచడానికి కొన్ని ప్రత్యేక నియమాలు, సరైన దిశలు ఉన్నాయి. వీటిని పాటించకపోతే ఇంట్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు.
వాస్తు ప్రకారం తులసిని సరైన పద్ధతి, దిశలో ఉంచడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, వృద్ధి కలుగుతాయి. అదే సమయంలో తులసి కోట పరిసరాల్లో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల వాస్తు దోషాలు కలగడమే కాకుండా నష్టాలు కూడా సంభవిస్తాయి. అందుకే తులసి మొక్కను ఇంట్లో నాటేటప్పుడు, పూజలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాస్తు నిపుణులు సూచిస్తోన్నారు.

తులసి మొక్కను ఉంచడానికి ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశ అత్యంత శుభప్రదమైనవిగా పరిగణిస్తారు.. వాస్తు శాస్త్రంలో. ఈ దిశలను జల స్థానాలుగా భావిస్తారు. ఆ దిశల్లో తులసిని ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందనే నమ్మకం ఉంది. అలా వీలు పడకపోతే తూర్పు దిశలోనైనా తులసి మొక్కను ఉంచుకోవచ్చు.
ఈ దిశ కూడా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుంది. దక్షిణ లేదా నైరుతి దిశల్లో ఎంతమాత్రం ఉంచకూడదు. ఈ దిశలను యమస్థానాలుగా, ప్రతికూల శక్తి కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ తులసిని ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పశ్చిమ దిశలో కూడా తులసిని ఉంచకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తగిన జాగ్రత్తలతో ఈ దిశలో తులసి మొక్కను ఉంచాలి.
తులసి.. అత్యంత పవిత్రమైనందు వల్ల దాని పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి. తులసి మొక్క దగ్గర ఎట్టిపరిస్థితుల్లోనూ చెత్తబుట్టలను ఉంచకూడదు. అపరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. తులసి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే చెప్పులు, బూట్లను తులసి కోట దగ్గరగా ఉంచకూడదు. చెప్పులు విడిచే చోట తులసి మొక్క ఉంటే అది ఇంట్లో నష్టాలను తెచ్చిపెడుతుంది.
తులసి మొక్క ఉన్న కుండీలో లేదా దాని పక్కన కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను కూడా పెంచకూడదు. ఇవి మానసిక ఒత్తిడిని, కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఇంట్లోని పాత సామాన్లు, ఇనుప వస్తువులు, వాడకుండా పడేసిన కబాడ్ వస్తువులను తులసి పరిసరాల్లో వేయకూడదు. చీపురు, ఫ్లోర్ క్లీనర్ వస్తువులను కూడా తులసికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచింది.
కొత్తగా తులసి మొక్కను ఇంట్లో నాటడానికి గురువారం, శుక్రవారం చాలా అనుకూలమైన రోజులు. శ్రీమహావిష్ణువుకు ప్రియమైన గురువారం నాడు తులసిని నాటితే విశేష పుణ్యఫలం లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో తులసిని నాటడం అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. ఆదివారం, ఏకాదశి తిథులలో తులసిని కొత్తగా నాటడం లేదా దాని ఆకులను కోయడం వంటి పనులు అస్సలు చేయకూడదు.














Click it and Unblock the Notifications