చేతికి ఎక్కువ జీతం కావాలా? కొత్త లేబర్ కోడ్‌ల షాక్. పీఎఫ్ తగ్గిస్తే భారీ గండి
ప్రతి నెలా ఒకటో తేదీ రాగానే మొబైల్‌కు వచ్చే 'శాలరీ క్రెడిటెడ్' మెసేజ్‌లో కాస్త ఎక్కువ అమౌంట్ కనిపిస్తే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. ప్రభుత్వం త్వరలో తీసుకురావాలని చూస్తున్న కొత్త లేబర్ కోడ్‌ల వల్ల ఉద్యోగుల చేతికి అందే నెలవారీ జీతం పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ వెసులుబాటు వెనుక ఒక పెద్ద 'ఆర్థిక గండం' దాగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత అవసరాల కోసం చేతికొచ్చే జీతాన్ని పెంచుకుంటే.. భవిష్యత్తులో మనం రిటైర్ అయ్యే సమయానికి చేతికందే సొమ్ము భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి?
ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. ఉద్యోగి మూల వేతనం (బేసిక్ శాలరీ) నుంచి 12 శాతం డబ్బులు ఈపీఎఫ్ (EPF) ఖాతాకు వెళ్తాయి. చాలా కంపెనీలు పూర్తి బేసిక్ శాలరీపై ఈ 12 శాతాన్ని కట్ చేస్తాయి. కానీ, కొన్ని కంపెనీలు మాత్రం నెలకు రూ. 15,000 లోపే పరిమితి పెట్టుకుని, కేవలం రూ. 1,800 మాత్రమే పీఎఫ్ ఖాతాకు మళ్లిస్తాయి.
కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం.. ఈ రూ. 1,800 కనీస పరిమితి కంటే అదనంగా కట్ అయ్యే పీఎఫ్ మొత్తాన్ని ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ మాట్లాడుకుని ఆపేసుకోవచ్చు. అంటే, పీఎఫ్ కటింగ్‌ను తగ్గించుకుని, ఆ మిగిలిన పైసలను ప్రతి నెలా జీతంతో పాటే చేతికి తీసుకోవచ్చన్నమాట.

తాత్కాలిక సంతోషం.. దీర్ఘకాలిక నష్టం!
జీతం పెరిగింది కదా అని తాత్కాలికంగా సంతోషపడొచ్చు కానీ, క్రమశిక్షణతో ఆ డబ్బును వేరే ఎక్కడైనా పెట్టుబడి పెట్టకపోతే మాత్రం భవిష్యత్తులో నష్టపోతాం. చేతికి అదనంగా వచ్చిన డబ్బును అనవసర ఖర్చులకు వాడేస్తే, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కరువవుతుంది.
ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం:
ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 50,000 అనుకుందాం. ఇప్పుడున్న రూల్ ప్రకారం నెలకు 12 శాతం అంటే రూ. 6,000 పీఎఫ్ కట్ అవుతుంది. ఒకవేళ కొత్త నిబంధనల ప్రకారం కనీస మొత్తమైన రూ. 1,800 మాత్రమే కట్ చేయించుకుని, మిగిలిన రూ. 4,200ను జీతంతో పాటు చేతికి తీసుకున్నారనుకుందాం.
-
ఒకవేళ ఆ రూ. 4,200ను పీఎఫ్‌లోనే ఉంచేస్తే.. ప్రస్తుతం ఉన్న 8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం 25 ఏళ్ల తర్వాత అది దాదాపు రూ. 41 లక్షల పెద్ద నిధిగా మారుతుంది.
-
ఇక ఉద్యోగి తన వైపు నుంచి కటింగ్స్ తగ్గించుకుంటే, అటు కంపెనీ కూడా తన అదనపు వాటాను ఇవ్వడం ఆపేస్తుంది. దీనివల్ల రిటైర్మెంట్ నాటికి పొందే మొత్తం ఫండ్ దాదాపు రూ. 80 లక్షల వరకు తగ్గిపోతుంది!
-
దీనికి తోడు చేతికొచ్చే అదనపు జీతంపై ఐటీ స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను (Tax) కట్టాల్సి వస్తుంది. అదే పీఎఫ్ ఖాతాలో ఉంటే రూపాయి కూడా టాక్స్ పడకుండా వడ్డీ పెరుగుతుంది.
ఎవరు పీఎఫ్ తగ్గించుకోవద్దు?
పొదుపు చేసే అలవాటు (డిసిప్లిన్) లేనివారు, 40 ఏళ్లు దాటిన ఉద్యోగులు, రిస్క్ లేకుండా సేఫ్‌గా డబ్బులు దాచుకోవాలనుకునే వారు అస్సలు పీఎఫ్ వాటాను తగ్గించుకోకూడదు. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులకు పీఎఫ్ అనేది ఒకే ఒక్క 'బలవంతపు పొదుపు' మార్గం. పైగా ప్రస్తుతం పీఎఫ్ ఇచ్చే 8.25 శాతం సురక్షితమైన వడ్డీని మార్కెట్లలోని ఇతర సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్లు ఏవీ ఇవ్వలేవు.
ఎవరు ఈ ఛాన్స్ వాడుకోవచ్చు?
12 నుంచి 14 శాతం అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్లు లేదా ఇతర భారీ అప్పులు ఉండి, వాటిని త్వరగా తీర్చేయాలనుకునే వారికి ఈ వెసులుబాటు ఉపయోగపడుతుంది. అలాగే, ఈపీఎఫ్ కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా సిప్ (SIP) చేయగల ఆర్థిక అవగాహన, క్రమశిక్షణ ఉన్నవారు మాత్రమే ఈ అదనపు టేక్ హోమ్ శాలరీని ఎంచుకోవచ్చు. ఏదేమైనా.. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కంపెనీ పీఎఫ్ పాలసీలను పూర్తిగా పరిశీలించుకోవడం మంచిది.














Click it and Unblock the Notifications