OG కాదు.. ముందా సంగతి తేల్చండి!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పీపీపీ కింద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రైతు సమస్యలు, ఓజీ సినిమా టికెట్ల పెంపుదల వంటి అంశాల ఆయన మాట్లాడారు.
ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో ఎంపీ చర్చించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మేయర్ సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆయా అంశాలను ప్రస్తావించారు.

అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరల పెంపుపై ఉన్న శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి రైతులపై లేదని అవినాష్ ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని, ఈ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఓజీ సినిమాకు 1,000 రూపాయలకు టికెట్ రేట్ ను అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చిందని గుర్తు చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం అన్ని చోట్ల విజయవంతం అయిందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీల వద్దకు తరలివచ్చారని, మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తోన్నారని అన్నారు.
పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జగన్.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని తన ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, వాటి నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారని గుర్తు చేశారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications