కిరణ్ 'పార్టీ' నేతల ఆగ్రహం: లగడపాటి హితవు, ఎద్దేవా
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. మూడు నాలుగు నెలలుగా కిరణ్ పార్టీ విషయమై జోరుగా చర్చ సాగుతోంది. కిరణ్ మాత్రం పార్టీ విషయంలో ఇప్పటి వరకు పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలను బట్టి కొత్త పార్టీకి అవకాశం ఉంటుందని భావిస్తున్నప్పటికీ, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంకా ఎప్పుడు పెడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీంతో ఆయనపై పలువురు నేతలు గుర్రుమంటున్నారట. టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస రావు, జెసి దివాకర్ రెడ్డి వంటి వారు కిరణ్ పార్టీ కోసం ఇటీవలి వరకు ఎదురు చూశారు. అయితే, ఆయన నుండి స్పందన రాకపోవడం వల్లనే వారు టిడిపిలోకి వెళ్తున్నారని అంటున్నారు. కిరణ్ పార్టీ పెడతారనే అశలు పెట్టుకున్న పలువురు ఆయనపై ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారట. పార్టీ స్థాపనపై బుధవారం విద్యార్థి సంఘాల ఐకాస నేతలతో జరిగిన సమావేశంలో కిరణ్ స్పష్టతను ఇస్తారని భావించారు.

కానీ, కిరణ్ నోటి నుంచి వారి ఊహలకు విరుద్ధమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవకాశవాద, దుష్ట రాజకీయాలను చూశాక ఎవరి కోసం పార్టీ పెట్టాలని, ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ దశలో విద్యార్థులు తమ కోసం పార్టీ పెట్టాలంటూ గట్టిగా నినాదాలు చేసినప్పటికీ ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా జై సమైక్యాంధ్ర అంటూ మూడుసార్లు నినాదాలు చేశారు.
గురువారం కిరణ్‌తో ఎంపీ సాయిప్రతాప్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీలోనూ పార్టీపై స్పష్టత రాలేదు. అంతకు ముందు కొందరు మేధావులతోనూ కిరణ్ చర్చలు జరిపారు. ఇలా రోజులు గడుస్తున్నా పార్టీ స్థాపనపై కిరణ్ నుంచి స్పష్టత లేకపోవడంతో తమకు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని, తమ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతోందని ఆయన్ను నమ్ముకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పెట్టక తప్పదని లగడపాటి.. కిరణ్‌తో అన్నారట. దానికి కిరణ్.. తాను పార్టీ పెట్టినా రాజకీయ సన్యాసం తీసుకున్న మీరు పార్టీలో చేరరు కదా అని లగడపాటిని ప్రశ్నించారు. విభజన జరిగితే తాను రాజకీయాల్లోంచి వైదొలగుతానని ఎప్పుడో ప్రకటించానని తాను పార్టీ గురించి అడుగుత్నుది తన కోసం కాదని, నమ్ముకుని వచ్చిన వారి కోసమని చెప్పారట.












Click it and Unblock the Notifications