నీటి సమస్యలపై కిరణ్ సుదీర్ఘ వివరణ: ఢిల్లీపై ఆగ్రహం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాగు, సాగు నీటి అంశాలు, ప్రాజెక్టుల విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శుక్రవారం వివరించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సమైక్యంగా ఉంటే నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో వివరించారు. అదే సమయంలో రెండు నెలలుగా ఉద్యమం జరుగుతున్నా కేంద్రం భరోసా ఇవ్వలేదని, భరోసా ఇవ్వాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. తద్వారా అధిష్టానంపై ఆయన మరోసారి ధిక్కార స్వరం వినిపించినట్లుగా కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన జరిగితే సాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందన్నారు. అప్పుడే విభజన జరిగి ఉంటే సాగు నీటి ప్రాజెక్టులు కట్టే వాళ్లం కాదని, లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేవి కాదన్నారు. విభజన జరిగితే సాగునీటి రంగంలో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సమైక్య రాష్ట్రం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు.

నాగార్జున సాగర్ నిర్మించేటప్పుడు నల్గొండ, గుంటూరు జిల్లాల్లో 70వేల ఎకరాలు నీట మునిగాయని, పులిచింతల వల్ల కూడా వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయన్నారు. అప్పుడే విడిపోతే భూమి ముంపునకు గురై ఉండేది కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయమై ఇతర రాష్ట్రాలతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. విభజన జరిగితే రైతులు నష్టపోతారని, ఆహార కొరత ఏర్పడుతుందన్నారు.
విభజన జరిగితే నికర జలాలకు మాత్రమే హామీ ఉంటుందని, మిగులు జలాలకు హామీ ఉండదన్నారు. అల్మట్టి ప్రాజెక్టు పెంపు ద్వారా రాష్ట్రానికి నీటి ప్రవాహం తగ్గిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 74 లక్షల ఎకరాలు, నాగార్జున సాగర్ ద్వారా 27.60 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. రాష్ట్రం విడిపోతే పలు ప్రాజెక్టులు కట్టడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే దుమ్ముగూడెం, పోలవరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీరు వస్తుందన్నారు.

వర్షాలు పడి నీళ్లు ఉంటే రాష్ట్రం విడిపోయినా ఇబ్బంది లేదని రాష్ట్రం నాలుగు అయినా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వర్షం సరిగా పడక నీటి సమస్య ఉంటే సమైక్యమే మంచిదన్నారు. వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు విభజనపై ముందుకెళ్లాలని కిరణ్ అన్నారు. ఎనిమిది జిల్లాలకు సాగర్ ద్వారా తాగు నీరు అందుతోందన్నారు. సమైక్య రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ఉద్యోగులు, సీమాంధ్రులు సమ్మె, ఆందోళనలు విరమించాలని కోరుతున్నానని కిరణ్ విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడటంతో, బస్సులు నడవక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల పైనే ఆధారపడిన వారికి నష్టమని కాబట్టి సమ్మె నిర్ణయాన్ని పునపరిశీలించాలన్నారు. ఆరున్నర లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నారన్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని కేంద్రం గుర్తించిందని, సమ్మెను వెంటనే విరమించాలని కోరారు.












Click it and Unblock the Notifications