టి బిల్లు ఒరిజినల్ కాదు, రాసివ్వండి: అధిష్టానంపై కిరణ్
హైదరాబాద్: అసెంబ్లీకి ఒరిజినల్ టి బిల్లు రాలేదని, దానిపై కేంద్రానికే స్పష్టత లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఓ కేంద్రమంత్రి బిల్లు, ముసాయిదా బిల్లు ఒక్కటేనని ఎలా చెబుతారని జైరామ్ రమేశ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. బిల్లు, ముసాయిదా బిల్లు ఒక్కటేనని కేంద్రం లిఖిత పూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండు ఒక్కటేననేది జైరామ్ రమేష్ వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చన్నారు. కేంద్రం తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని, జైరామ్ చెప్పిందే అయితే లిఖిత పూర్వకంగా చెప్పాలన్నారు. పార్లమెంటులో పెట్టే బిల్లు పైనే అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉంటుందన్నారు. కాబట్టి ఈ బిల్లు పైన స్పష్టత తప్పకుండా రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఏ బిల్లు అయినా చర్చించాలని కేంద్రమంత్రి ఎలా అంటారన్నారు. రాష్ట్రపతి నుండి వచ్చింది డ్రాఫ్ట్ బిల్లు కాబట్టే తిరస్కరించాలని తాను నోటీసు ఇచ్చానని చెప్పారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టే బిల్లునే కేంద్రం రాష్ట్రపతికి పంపించాలని, ఆ బిల్లునే రాష్ట్రపతి అసెంబ్లీకి పంపించాలన్నారు.
పార్లమెంటులో పెట్టే బిల్లు పైనే అసెంబ్లీలో సభ్యులు అభిప్రాయాలను చెప్పవలసి ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సవరణలు చేస్తే దానిని పార్లమెంటు ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చునని చెప్పారు. శాసన సభకు పంపిన బిల్లు రూపంలోనే పార్లమెంటులో ప్రవేశ పెట్టవలసి ఉంటుందన్నారు. బిల్లుపై కేంద్రానికే స్పష్టత లేనప్పుడు అసెంబ్లీ ఎలా అభిప్రాయం చెబుతుందన్నారు. బిల్లును తిరస్కరిస్తున్నామని సభాపతికి నోటీసు ఇస్తే మీడియా అనేక అర్థాలు చెబుతోందని అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications