కిరణ్ తగ్గాలి, జగన్‌ది మా డిఎన్ఏ: డిగ్గీ, తెరాస విలీనంపై
హైదరాబాద్: సిడబ్ల్యూసి నిర్ణయమే అంతిమమని, ఆ నిర్ణయానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కట్టుబడి ఉండాల్సిందేనని, తెలంగాణ రాష్ట్రం వస్తే తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారని ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుల దిగ్విజయ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను పదిహేను రోజుల్లో విశాఖలో పర్యటిస్తానని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్ని విభజనకు అంగీకరించాయన్నారు. అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాకే కాంగ్రెసు పార్టీ తీసుకుందన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆ తర్వాత మాటమార్చాయని తెలిపారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని, హైదరాబాదు పదేళ్లు రాజధానిగా ఉంటుందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.

రాష్ట్రపతి నుండి బిల్లు అసెంబ్లీకి వచ్చిందని, అసెంబ్లీ దానిని ఆమోదించాక బిఏసి సమావేశమవుతుందన్నారు. సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చునని సూచించారు. రాష్ట్ర విభజన ద్వారా వచ్చే అన్ని అంశాల పైన చర్చించాలన్నారు. బిల్లులోని అన్ని క్లాజుల పైన సభ్యులు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా చెప్పవచ్చునని తెలిపారు. ఇరు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం హామీ ఇస్తుందని, పోలవరం ప్రాజెక్టు బాధ్యతను పూర్తిగా కేంద్రం చూస్తుందన్నారు.
హైదరాబాదులో నివసించే సీమాంధ్రుల భద్రతపై ప్రభుత్వం హామీ ఇస్తుందన్నారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం, ఆస్తులు ఏర్పర్చుకోవచ్చునని రాజ్యాంగం అందరికీ హక్కు కల్పించిందన్నారు. హైదరాబాదులో నివసించే హక్కు అందరికీ ఉందని, రాజకీయ పార్టీలు అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నీటి పంపిని బోర్డు పరిశీలిస్తుందని చెప్పారు. సోమవారం తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చే అవకాశముందన్నారు.
తెలంగాణలో ఉండేవారికి, వారి ఆస్తులకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి తీర్మానమే అంతిమ నిర్ణయమన్నారు. బిల్లును కేంద్ర న్యాయశాఖ కూలంకుషంగా పరిశీలించిందని తెలిపారు. భూసేకరణ చట్టం నిబంధనలకు లోబడి పోలవరంకు భూసేకరణ ఉంటుందన్నారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి నలభై రోజుల సమయం ఇచ్చిందని, జనవరి 23వ తేదీలోగా అసెంబ్లీ తమ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపించవలసి ఉంటుందన్నారు.
కిరణ్ కట్టుబడి ఉండాల్సిందే
సిడబ్ల్యూసి తీర్మానమే తుది నిర్ణయమని కాంగ్రెసువాదులందరికీ తెలుసునని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. సిడబ్ల్యూసిలో కిరణ్ తన వాదన బాగా వినిపించారన్నారు. కిరణ్ చేస్తున్న ప్రకటనలు తమ దృష్టిలో ఉన్నాయన్నారు.
బాబుకు ఇప్పటికీ స్పష్టత లేదు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. విభజనపై చంద్రబాబుకు ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. బాబు అంటే తనకు గౌరవమని, అయితే ఆయన ఏం కోరుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రెండు ప్రాంతాల్లో రెండు ప్రత్యేక కమిటీలు వేసే ఆలోచనలో ఉన్నామని, ఆ రెండు కమిటీలు పిసిసి ఆధ్వర్యంలో పని చేస్తాయని, వీటిపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
జెసికి నోటీసులు, జగన్ మా డిఎన్‌ఏనే
అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపిస్తారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిది తమ పార్టీ డిఎన్‌ఏ అన్న దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. బిజెపిది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు.












Click it and Unblock the Notifications