హైద్రాబాద్‌పై సమరమే, కిరణ్ కథ ముగుస్తుంది: కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన కిరి కిరి పెడితే సమరమేనని, ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కథ అక్టోబర్ 6తో ముగుస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. నిజాం కళాశాలలో తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో జరిగిన సకల జన భేరీలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే డిజిపి దినేష్ రెడ్డి బల్పు ఆరిపోయిందని, కిరణ్ కథ మరో వారం రోజుల్లో ముగుస్తుందన్నారు.
సీమాంధ్రలో జరుగుతోంది దిక్కుమాలిన ఉద్యమమని, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా తెలంగాణ ద్రోహులేనని మండిపడ్డారు. అక్కడ మేథావి అనేటోడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. నిట్టనిలువున చీలినా కలిసుంటామనడమేమిటన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పావురాలగుట్టలో పావురమయ్యాడని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

సభలో ప్రసంగించిన ప్రతి ఒక్కరి మాటల్లో 'హైదరాబాద్ సిర్ఫ్ హమారా' అనే నినాదం ఏదో ఒక రూపంలో ప్రతిధ్వనించింది. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని కెసిఆర్ ప్రకటించారు. సంపూర్ణ తెలంగాణ సాధించే దాకా అప్రమత్తంగా ఉండాలని ఉద్యమకారులకు సూచించారు. యూపిఏ గోల్‌మాల్ చేసినా భయపడాల్సిన అవసరంలేదని ఎన్డీయే రూపంలో ప్రత్యామ్నాయం ఉందని కెసిఆర్ పేర్కొనడం, బిజెపిని ప్రశంసించడం గమనార్హం.
లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే సీమాంధ్రలో పుట్టిన వారంతా తెలంగాణ ద్రోహులే అని కెసిఆర్ చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే... సీమాంద్రులకు నాలుగైదు బంగ్లాలు ఇస్తామన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు నష్టపరిహారం, ప్యాకేజీ దెబ్బతిన్నవాళ్లకివ్వాలని, ఆ ప్యాకేజీ తెలంగాణకే ఇవ్వాలన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధించేదాకా ఉద్యమం సాగించాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు గొప్పవాళ్లని, విభజన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి అందరూ ఒప్పుకున్నామని, పీడ, దోపిడీ నుంచి శాశ్వతంగా విముక్తం కావాలంటే మనం కొంచెం వెసులుబాటు కల్పించేలా ఉండాలని అందుకే, ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నామని చెప్పారు. కాంగ్రెసు గోల్ మాల్ చేసిన బిజెపి ఉందని, తెలంగాణపై ఇప్పటిదాకా మాట మీద నిలబడిన పార్టీ బిజెపి మాత్రమేనని అందుకే ఆ పార్టీ అగ్ర నేత సుష్మా స్వరాజ్‌కు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.
2001లో నేను ఒకే ఒక్క మనిషినని, ముందున్నది కారుచీకటని, లాంతరు పట్టుకుని ధైర్యంచేసి అడుగేశానని చెప్పారు. బక్కగా ఉన్నాడు ఏం చేస్తాడులే అని అందరు అనుకున్నా, దుష్ప్రచారాలు చేసినా, దాడులు జరిపినా.. 13 ఏళ్ల ప్రస్థానంలో అవన్నీ కారుమబ్బుల్లా కరిగిపోయాయన్నారు.
కాగా, ప్రభుత్వ కార్యాలయాలు కేంద్రీకృతమైన ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాలు మాత్రమే ఉమ్మడి రాజధానిలో భాగమై ఉంటాయని మరికొందరు తెలిపారు. సభ జరుగుతున్న సమయంలోనే డిజిపి దినేశ్ రెడ్డి పదవీకాలం ముగిసినట్లు స్పష్టం కావడంతో 'దినేశ్ రెడ్డి పీడ విరగడైంది' అని కోదండరాం పదేపదే చెప్పారు.












Click it and Unblock the Notifications