కిరణ్‌కు అవార్డ్: అసంతృప్తి, అధిష్టానానికి ముఖం చాటు!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఇండియా టుడే అవార్డును అందుకున్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరేందుకు అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చిన కిరణ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఇండియా టుడే అవార్డును స్వీకరించారు.
ఉత్తమ పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియా టుడే ఈ అవార్డును ఇచ్చింది. దీనిని కిరణ్ కేంద్రమంత్రి జైరామ్ చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమైందన్న ప్రశ్నపై కిరణ్ స్పందించారు. అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం డ్యూటీ అని, ఇంకెవరు చేస్తారని అన్నారు.

ఎవరినీ కలవకుండానే తిరుగుముఖం?
ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలను ఎవరినీ కలవకుండానే తిరుగు ముఖం పట్టనున్నారని సమాచారం. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్య నేతలను కలవకుండానే తిరుగు ముఖం పడతారనే అంశం చర్చనీయాంశమైంది. అధిష్టానం వైఖరిపై కిరణ్ అసంతృప్తితో ఉన్నందువల్లే దూరంగా ఉంటున్నారంటున్నారు.
ఇండియా టుడే అవార్డు స్వీకరించిన అనంతరం ఎపి భవన్‌కు వచ్చిన కిరణ్.. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివ రావు, సాయి ప్రతాప్‌లతో భేట అయ్యారు.
గాడిద గుడ్డు అవార్డు ఇస్తే..: నర్సారెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇండియా టుడే గుడ్ గవర్నెన్స్ అవార్డు రావడంపై ఎమ్మెల్సీ నర్సా రెడ్డి స్పందిస్తూ.. గాడిద గుడ్డు అవార్డు ఇస్తే బాగుంటుందన్నారు. కిరణ్ గవర్నెన్స్ జీరో అన్నారు.












Click it and Unblock the Notifications