మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు కేసుల కారణంగా రాష్ట్రంలోని 23 మున్సిపాలిటీలో ఎన్నికలు వాయిదా పడగా.. మిగతా 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే 87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు పూర్తి కాగా.. నవంబర్ లో మరో 13 పాలకవర్గాల గడువు ముగియనుంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్‌లను యథాతథంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించామని.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కో ప్రక్రియ పూర్తి చేసుకుంటూ వెళ్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.

మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కీలక పరిణామం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు తమకు తగిన సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications