నేడు ఢిల్లీకి సీఎం రేవంత్: షెడ్యూల్ ఇలా.. కీలక అంశాలపై చర్చ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఉదయం ఢిల్లీకి రెండు రోజుల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన బయలుదేరారు. ఈ పర్యటనలో రాజకీయ, పరిపాలనా అంశాలు రెండూ ఉన్నాయి. ఢిల్లీ చేరుకున్న తొలి రోజున పలువురు ప్రముఖులతో భేటీలు జరుగుతాయి.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం .అలాగే అసోం కు చెందిన ఒక టీవీ, పత్రికా సంస్థ నిర్వహించే కార్యక్రమానికి హాజరు కానున్నట్టు సమాచారం. మరుసటి రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

ఈ సమావేశంలో జాతీయ, రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల వ్యూహాలు, తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, ఆరు గ్యారెంటీల అమలు పురోగతి వంటి అంశాలపై చర్చ జరుగనుంది. ఓట్ చోరీ అంశంపై నిర్వహించే ప్రత్యేక సిడబ్ల్యూసీ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ప్రత్యేక భేటీలు కూడా జరగవచ్చు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై కూడా మాట్లాడే అవకాశం ఉంది.
రాజకీయాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలపై కూడా సీఎం దృష్టి పెట్టనున్నారు. కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ నిధులు, విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణ వంటి అంశాలపై వినతులు సమర్పించనున్నారు.పర్యటన ముగించుకుని 30వ తేదీ ఉదయం హైదరాబాద్ చేరుకున్న వెంటనే సీఎం సిరిసిల్లకు వెళ్లనున్నారు. అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణను కూడా అక్కడ వివరించనున్నారు. ఇప్పటివరకు అధికారం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం ఇది 78వ సారి. నేడు, రేపు కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. లేదంటే మరుసటి రోజు హైదరాబాద్ కు చేరుకుంటారు. బుధవారం నాడు సీఎం రేవంత్ రెడ్డికి సిరిసిల్ల పర్యటన ఉంది.












Click it and Unblock the Notifications
