ఆర్మీ వాహనాలు ఇక శతృ దుర్భేధ్యం..: డీఆర్డీఓ బిగ్ బ్రేక్ త్రూ
ఆర్మీలో రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపర్చేదిశగా ఓ కీలక ముందడుగు పడింది. దీనికోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఓ జాయింట్ వెంచర్ గా ఆవిర్భవించింది. కోల్‌కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న సీఎస్‌ఐఆర్-సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CGCRI) తో చేతులు కలిపింది. సైనిక దళాల సాయుధ వాహనాలకు అవసరమైన అత్యంత తేలిక, అత్యాధునిక స్వదేశీ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను అభివృద్ధి చేయబోతోంది. దీనికోసం రూ. 50 కోట్ల విలువ చేసే ప్రాజెక్టును ఈ రెండు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి.
ఆర్మీ వాహనాల భద్రతలో బుల్లెట్‌ప్రూఫ్ అద్దాలు అత్యంత కీలక. ప్రస్తుతం సైన్యం ఇలాంటి వ్యవస్థల కోసం విదేశీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దేశీయంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దిగుమతి చేసుకుంటోన్న వాటితో పోలిస్తే నూతనంగా అభివృద్ధి చేయబోయే బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ బరువు, దాని మందం 30 నుంచి 50 శాతం వరకు తక్కువగా ఉంటుందని డీఆర్డీఓ వెల్లడించింది.

ఈ బుల్లెట్‌ప్రూఫ్ మెటీరియల్ తయారీలో స్పెషల్ గ్లాస్ సెరామిక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇందులో అమర్చిన నానోమీటర్ పరిమాణంలోని అత్యంత సూక్ష్మ స్ఫటికాలు గ్లాస్‌కు బలమైన రక్షణను ఇవ్వడమే కాకుండా పారదర్శకతను ఏమాత్రం దెబ్బతీయవు. ఈ అద్దం.. నేరుగా ఏకే-47 రైఫిల్ నుంచి వచ్చే బుల్లెట్ల దాడిని కూడా తట్టుకోగలదు. కనీసం 100 మీటర్ల దూరం నుంచి నిర్దేశిత వేగంతో దూసుకొచ్చే బుల్లెట్లను సులువుగా నియంత్రించేలా బీఐఎస్- వీ, వీఐ స్టాండర్డ్స్ కు అనుగుణంగా దీనిని అభివృద్ధి చేస్తారు.
చండీగఢ్‌కు చెందిన టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, మహారాష్ట్రలోని నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి డీఆర్‌డీవో ల్యాబ్‌లు కలిసి పనిచేయనున్నాయి. బాలిస్టిక్ టెస్ట్ లల్లో ఈ ప్రత్యేక గ్లాస్ ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను కనబరిచిందని ప్రాజెక్ట్ లీడర్, సీనియర్ సైంటిస్ట్ అతియార్ రహ్మాన్ ముల్లా వెల్లడించారు. ట్రిచీ అసాల్ట్ రైఫిల్ ద్వారా 10 మీటర్ల దూరం నుంచి ప్రయోగించిన బుల్లెట్లను కూడా ఈ గ్లాస్ విజయవంతంగా అడ్డుకుందని చెప్పారు.
నాలుగేళ్ల కాలపరిమితి కలిగిన ఈ వినూత్న ప్రాజెక్ట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. దేశీయ పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ ల్యాబ్ టెక్నాలజీని ఉత్పత్తి రంగంలోకి మార్చడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ స్వదేశీ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ తేలికగా ఉండటం వల్ల సైనిక వాహనాలకు అదనపు రక్షణను కల్పించినట్టవుతుంది. ఫలితంగా వాటి మొబిలిటీ, ఇంధన సామర్థ్యంతో పాటు మరిన్ని పేలోడ్ మోసుకెళ్లే కెపాసిటీ కూడా భారీగా పెరుగుతాయని సీజీసీఆర్‌ఐ వివరించింది.












Click it and Unblock the Notifications
