మేం అధికారంలోకి రాగానే..: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మాట ఇచ్చిన జగన్
రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులు విజయవాడలో రోజంగా నిర్వహించిన ఆందోళనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తన వైఖరిని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన సచివాలయాల ఉద్యోగులపై దాడి చేయడాన్ని జగన్ అమానుష చర్యగా అభివర్ణించారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆందోళన చేస్తే లాఠీఛార్జీ చేయించడం, మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చి పడేయడం సరికాదని చెప్పారు. ఆందోళనలపై దాడులు చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారిచ్చారని నిలదీశారు.

ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, మేం పీఆర్సీ చైర్మన్‌ను నియమిస్తే మీరు వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన అయిదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగులు రోడ్డెక్కినప్పుడు రెండు డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ. 40,000 వేల కోట్లు. ఇవి ఇవ్వాలని అడిగిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం సరికాదు..' అని అన్నారు.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే గ్రామ, వార్డు సచివాలయాలపై కక్షగట్టారని, గ్రామ స్థాయిలోనే 540కి పైగా సేవలందించిన వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారని జగన్ అన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేయడానికి కుట్రలు పన్నుతూనే ఉన్నారని విమర్శించారు. హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30,000 ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాకుండా, వలంటీర్లకు రూ.10,000 వేల జీతం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారని అన్నారు.

ఇప్పుడు వలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పని భారాన్ని మోపారని, పారదర్శకతకూ, ఇంటి వద్దకే పాలనకూ తెరదించారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు.. ఇలా ఈ రెండున్నరేళ్ల పరిపాలనలో సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.
వారి కష్టాలు, వారి బాధలు వినే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుందని జగన్ చెప్పారు. ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయాలని జగన్ అన్నారు.
ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను.. అని జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటి కంటే మరింత బలోపేతం చేస్తామని తేల్చి చెప్పారు. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు- ఆరుకాయలుగా వర్దిల్లుతుందని, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుందని జగన్ అన్నారు.
ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మళ్లీ అందేలా, దేశం అంతా మన వైపు చూసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయిందని, ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమేనని వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకుంటే ఆ కాలం కూడా ఇట్టే గడిచి పోతుందని, మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుందని, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు.













Click it and Unblock the Notifications
