కిరణ్ రెడ్డి వ్యాఖ్య: కాంగ్రెస్‌కు దూరమేనా, పార్టీయా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన శనివారంనాడు కాంగ్రెసు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం, ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్య ఆ ఊహాగానాలు తిరిగి చెలరేగడానికి కారణమయ్యాయి. పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెసు వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసిన ప్రపంచ దేశాలు - పాలనా వ్యవస్థలు అనే పుస్తకం ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు.
అదే సమయంలో ప్రముఖ కాంగ్రెసు నాయకుడు పి. జనార్దన్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీకి దూరం కావడానికే నిశ్చయించుకున్నారని ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఆయన మొక్కుబడిగా హాజరయ్యారని అంటున్నారు. రాహుల్ గాంధీ వద్ద మరోసారి రాష్ట్ర విభజనను వ్యతిరేకించానని చెప్పుకోవడానికి ఆ సమావేశాన్ని ఆయన వాడుకున్నట్లు చెబుతున్నారు.

కాగా, ఏ పార్టీలో ఉన్నా తాను వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి దగ్గుబాటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అన్నారు. కాంగ్రెసులో తన వ్యక్తిత్వానికి దెబ్బ తగిలిందనే భావనకు గురయ్యాననే భావనతోనే ఆయన ఆ వ్యాఖ్య చేశారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
జనవరి 23వ తేదీ తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటారని చెబుతున్నారు. ఇతర పార్టీలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న శాసనసభ్యులను కూడా ఆ విషయమే చెప్పి నిలువరిస్తున్నట్లు చెబుతున్నారు. ఏదైనా జనవరి 23వ తేదీ తర్వాత కలిసే నిర్ణయం తీసుకుందామని ఆయన చెబుతున్నట్లు సమాచారం.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 23వ తేదీ తర్వాత తన సొంత పార్టీ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తారని అంటున్నారు. శాసనసభ తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications