ఇతరులకు చెప్పను: కిరణ్, టీపైనే కోపం: మల్లేష్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో సిపిఐ సభ్యుడు గుండా మల్లేష్ చేసిన వ్యాఖ్యకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఎందుకు విభజనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నానో చెప్తాని ముఖ్యమంత్రి అన్నారు. తమ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నానని వేరే వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సమైక్యం తమ నినాదం కాదని, విధామని ముఖ్మమంత్రి అన్నారు. విభజన విషయంలో తాను అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని, అది తనకూ అధిష్టానానికీ సంబంధించిన విషయమనీ, తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో సభలో చెప్తానని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిగా తనకు గౌరవం ఉందని, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారని, ఏదో చేయాలనే తపన ఉందని, ఒక్క తెలంగాణ విషయంలోనే తనకు ముఖ్యమంత్రిపై కోపం ఉందని గుండా మల్లేష్ అన్నారు. తెలంగాణ వల్లనే సమస్య వచ్చిందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, కేవలం సీమాంధ్రకు మాత్రమే కారని ఆయన అన్నారు. ప్రజల్లో విభజన వచ్చిందని, ఇప్పుడు పిడికిలి తెరిచి ఉందని, రహస్యం కాదని ఆయన అన్నారు.

అంతకు ముందు, మంత్రి శైలజానాథ్ గుండా మల్లేష్‌ను వ్యతిరేకించారు. మల్లేష్ తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలను కించపరుస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ సంస్థానం చరిత్రను వక్రీకరించవద్దని ఆయన అననారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యమని ఆనాడు కమ్యూనిస్టులు అన్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని గుండా మల్లేష్ అన్నారు. శైలజానాధ్ కరుడు గట్టిన సమైక్యవాది అని ఆయన అన్నారు. చారిత్రక విషయాలు అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
శాసనసభలో సమైక్య తీర్మానం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. జాతీయ పార్టీగా, కమ్యూనిస్టులుగా చెబుతున్నాం, సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి తాము ముందుకు వస్తామని ఆయన అన్నారు. మనమంతా రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశామని, రాజ్యాంగబద్దంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం బిల్లును తయారు చేసిందని, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిందని ఆయన అన్నారు. అన్ని పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలమని చెప్పాయని, ఓట్లూ సీట్ల కోసం మాట మారుస్తున్నాయని ఆయన అన్నారు. ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదించి పంపించాలని ఆయన అన్ని పార్టీలకూ విజ్ఝప్తి చేశారు.
గుండా మల్లేష్ తన చర్చను ముగించిన తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications