తేల్చేసిన లగడపాటి: కిరణ్ రెడ్డి పార్టీ బూచీయే?
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానంతో ఢీకొడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టే విషయం తేలిపోయినట్లేనని భావిస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. శనివారం కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పిన మాట ఆ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. కొత్త పార్టీ పెట్టడానికి సమయం సరిపోదని ఆయన అన్నారు.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ కొత్త పార్టీ విషయంపై ఆ విధంగా తేల్చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీకి ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు పునాదులు తయారు చేస్తున్నారని, లగడపాటి రాజగోపాల్ సహకారంతో పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి.
విజయవాడ వంటి సీమాంధ్రలో వెలిసిన సమైక్యాంధ్ర పోస్టర్లు, టీవీ చానెళ్లలో ఇచ్చిన వాణిజ్య ప్రకటనలు కొత్త పార్టీపై ఊహాగానాలకు ఊపునిచ్చాయి. ముఖ్యమంత్రి కూడా కొత్త పార్టీ పెట్టే విషయంపై ఎటూ తేల్చకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే, తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభ తిరస్కరించిన తర్వాత జాతీయ మీడియాతో ఆయన పార్టీ గురించి తన అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

తాము తిప్పి పంపిన బిల్లును పార్లమెంటులో యథాతథంగా ఆమోదిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. ఇదే సమయంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటే రాజకీయ పార్టీ పెడతానని కాదని ఆయన స్పష్టత ఇచ్చారు. కాంగ్రెసు అధిష్టానాన్ని బెదిరించడానికి సీమాంధ్ర నాయకులు కొత్త పార్టీ గురించిన పుకార్లను ముందుకు తెచ్చారనే వాదన బలపడుతోంది.
కాగా, కాంగ్రెసు అధిష్టానం సూచనల మేరకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్సిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు సహకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా విమర్శలు చేస్తున్నారు. దానికితోడు, అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని వివరణ కోరడం లేదని, ఆయనపై చర్యలు ఉండవని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
మొత్తం వ్యవహారం చూస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో సమైక్యాంధ్ర హీరోగా ముందుకు రావడానికే అధిష్టానంపై తిరుగుబాటు చేస్తున్నారనే ఇతర పార్టీల విమర్శలకు బలం చేకూరుతోందని అంటున్నారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఆయనకు లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications