సహించం, ఓయు గుర్తుందా: కెసిఆర్‌కు కిషన్ వార్నింగ్
హైదరాబాద్: తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవమానాలను ఇక సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం అన్నారు. ఉద్యమ సమయంలో తమపై ఎన్నిక విమర్శలు చేసినా ఓపిక పట్టామని, ఇక ఇప్పుడు ఊరుకునే సమస్యే లేదన్నారు. కెసిఆర్ ధోరణి వల్ల తెలంగాణకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఆయనను ఐకాస చైర్మన్ కోదండరాం అదుపులో పెట్టాలన్నారు.
తమ పార్టీ ప్రధాని అభ్యర్థిని నరేంద్ర మోడీని సన్నాసి అని సంబోధించిన రటచవఆర్‌ను వెయ్యిసార్లు సన్నాసి అంటామన్నారు. లక్ష కోట్ల సార్లు ద్రోహి అంటామన్నారు. ఉద్యమ సందర్భంగా తనను కొత్త భిక్షగాడు అన్నారని, తెలంగాణ ఉద్యమానికి ఇబ్బంది రాకూడదని అప్పట్లో సంయమనం పాటించామని, ఇక ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. మాటకు మాట ఇస్తామని, ఒక్క మాటంటే 10 సార్లు అంటామని చెప్పారు.

నోటిని అదుపులో పెట్టుకుంటే సరేసరి లేదంటే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. కెసిఆర్ ఎన్నికల ప్రచార స్థాయిని పూర్తిగా దిగజార్చారన్నారు. పార్టీతో కుమ్మక్కై, ఆ పార్టీ స్క్రిప్టును చదువుతున్నారన్నారు. ఇదే ధోరణి కొనసాగిస్తే తెరాసకు ఓట్లు, సీట్లు వచ్చినా తెలంగాణకు న్యాయం జరగదన్నారు. నిత్యం కాంగ్రెస్, తెరాస పరస్పరం దూషించుకుంటున్నాయని, వాళ్లు డ్రైనేజీలో పొర్లినా తమకు అభ్యంతరం లేదు.. కానీ మధ్యలో తమ పార్టీనీ, తమ నేతల్ని ఎందుకు తిట్టడమేమిటన్నారు.
తెలంగాణ కెసిఆర్ జాగీరు కాదని, ఆయన పెటెంట్ అంతకన్నా కాదన్నారు. తామేం చేతులు కట్టుకుని కూర్చోలేదని, ఆయనకంటే ఎక్కువగా మాట్లాడతామని, తిట్టగలమని, బిజెపితో పెట్టుకోవద్దని హెచ్చరించారు. కెసిఆర్‌ది ఒకటే అజెండా అని, ఓట్లు, సీట్లు కొల్లగొట్టడానికి దేనికైనా దిగజారుతారని, 1100 మంది ఆత్మహత్యలపై మాట్లాడరని, ఉద్యమంలో కేసులపై నోరు విప్పరని, తానే అన్నట్లు అహంకారపూరితంగా మాట్లాడతారన్నారు. ఆయనకు ఇంత అహంకారం పనికి రాదన్నారు.
అందరూ సన్యాసులట.. ఆయనొక్కడే తెలివిమంతుడట... అని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగిందో తెలుసు కదా అన్నారు. ఇలాగే మాట్లాడితే తెలంగాణ అంతటా హెలికాప్టర్లు ఎక్కడా దిగవని హెచ్చరించారు. మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు కలిసి హైదరాబాద్‌ను యూటి చేసే కుట్ర పన్నుతున్నారంటూ కెసిఆర్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఆయనకేమైనా కల పడిందా అన్నారు.












Click it and Unblock the Notifications