లిస్ట్‌లో కిషన్ రెడ్డి పేరు మిస్! టిక్కెట్ కోసం హోరాహోరీ

ఈ నేపథ్యంలో మంగళవారం విడుదల చేసిన తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు లేదు. ఆయన ప్రస్తుతం అంబరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సికింద్రాబాదు లోకసభకు పోటీ చేయాలని ఆయన యోచించినట్లుగా వార్తలు వచ్చాయి. కాని పక్షంలో మళ్లీ అంబరుపేట నుండి పోటీ చేయాలనుకున్నారు. కానీ రెండు రోజుల క్రితం తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో నామినేషన్లకు బుధవారం చివరి రోజు. ఈ రోజు తేలాల్సి ఉంది.
మరోవైపు... టిక్కెట్ల పై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. టిక్కెట్ కోసం నేతలు రెండు మూడు రోజుల్లోనే రెండుమూడు పార్టీలు మారుతున్నారు. తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు బుధవారంతో గడువు ముగుస్తుండటంతో... మంగళవారం రాత్రిదాకా దాదాపు అన్ని పార్టీల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంగళవారం ఉదయాన్నే తెరాస మరో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రకటించిన జాబితాలో చివరి నిమిషం మార్పులు జరిగాయి.
టి జెఏసి నేతల్లో గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్‌లకు తొలుత గల్లంతైన సీట్లు చివరికి ఖరారయ్యాయి. అలాగే.. ఐకాస నేత కత్తి వెంకటస్వామికి నర్సంపేట టికెట్ దక్కింది. విద్యార్థి నేత క్రిషాంక్‌కు కన్నీరే మిగిలింది. బిజెపి, టిడిపి అర్ధరాత్రి దాకా వేచి చూసి మరీ తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటించాయి. కరీంనగర్ సీటు సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావుకు దక్కింది. దత్తన్నకు సికింద్రాబాద్ ఖరారైంది. ఈ సీటుపై కన్నేసిన కిషన్ రెడ్డికి నిరాశే మిగిలింది.
బిజెపి 8 లోకసభ, 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించింది. మెదక్‌లో కెసిఆర్‌పై నరేంద్రనాథ్‌ను నిలిపింది. బిజెపి లిస్టు తర్వాత... టిడిపి జాబితా బయటికొచ్చింది. మల్కాజిగిరి లోక్‌సభపై పట్టుబట్టిన రేవంత్ రెడ్డికి.... చివరికి ఆయన సిట్టింగ్ స్థానమైన కొడంగల్ అసెంబ్లీయే దక్కింది. మల్కాజిగిరిపై మంగళవారం అర్ధరాత్రి దాటేదాకా అంతులేని హైడ్రామా నడిచింది. బిసి నేత ఆర్ కృష్ణయ్యకు హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ స్థానం కేటాయించారు.












Click it and Unblock the Notifications