ఎవరీ రేవంత్ రెడ్డి, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నుంచి రేవంత్ రెడ్డి పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అందుకు కారణం తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేయడమే.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను ప్రలోభ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, ఇందులో భాగంగా రూ. 50 లక్షలు అందజేస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు రేవంత్ రెడ్డిపై పడింది.
ఎవరీ రేవంత్ రెడ్డి, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. నవంబర్ 8, 1969న మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లె గ్రామంలో జన్మించారు. ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పట్టా పొందారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై ఎంతో ఆసక్తి కనబర్చేవారు. విద్యార్ధి దశలోనే పలు యూనియన్లకు లీడర్‌గా ఉన్నారు. రేవంత్ రెడ్డి తొలుత గోడలపై ప్రకటనలు రాసేవారు. ఇందుకోసం వనపర్తిలో ఆర్టిస్టుగా దుకాణం ప్రారంభించారు.

ఆ రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రచారాల కోసం బోర్డులపై రాసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో నారాయణగూడలో డిజిటల్ బోర్డు తయారు చేసే షాప్ నిర్వహించారు. నారాయణ గూడలో ఉండగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత మిడ్జిల్ మండల జెడ్పీటీసీ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండేళ్లపాటు ఎమ్మెల్సీగా పని చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపునుంచి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014 ఎన్నికల్లో కూడా అదే నియోజక వర్గం నుంచి తన ప్రత్యర్ధి తెలంగాణ రాష్ట్ర సమితి నేత గురునాథ్ రెడ్డిపై 14,452 ఓట్లతో గెలుపొందారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా కీలక భూమిక పోషిస్తున్నారు.
రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ప్రత్యర్ధులను తన మాటలతో చిత్తు చేయగలిగే సత్తా ఉంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ రెడ్డి తన నియోజక వర్గంలో కొసిగిలో బస్ స్టేషన్‌లో నిర్మించడంతో పాటు, పాలిటెక్నిక్ కాలేజీ వచ్చేలా చేశారు.












Click it and Unblock the Notifications