మాపై నిఘా పెట్టారు- జగన్ స్కూలే సెపరేటు: కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన సమీక్షించారు. ఇందులో అలసత్వాన్ని ప్రదర్శించిన కొందరు ఎమ్మెల్యేలను సున్నితంగా మందలించారు.
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు.ఇందులో భాగంగా తరచూ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోన్నారు.

మరో దఫా కీలక భేటీ..
ఈ క్రమంలో వైఎస్ జగన్ ఇవ్వాళ మరోసారి పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.. ఇందులో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటోన్నారు?, సమస్యల పరిష్కారం చూపుతున్న చొరవ, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై ఇప్పటికే ఆయన ఓ నివేదికను తెప్పించుకున్నారు.

నిఘా ఉంచారు..
ఈ భేటీ ముగిసిన అనంతరం మాజీ మంత్రి, గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని విలేకరులతో మాట్లాడారు. తనలాంటి కొంతమంది ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ పీకారని స్పష్టం చేశారు. బ్యాక్ బెంచ్ బాయ్స్ ను హెచ్చరించారని చెప్పారు. ఇకపై కుంటి సాకులు చెప్పి, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించకుండా తప్పించుకోలేమని స్పష్టం చేశారు. తక్కువ సమయం పాటు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించిన వారిని జగన్ హెచ్చరించారని చెప్పారు.

ఒళ్లు బద్ధకం..
తనలాంటి కొందరు ఎమ్మెల్యేలకు ఒళ్లు బద్ధకం పెరిగిందని, ఎక్కడికి వెళ్తే అక్కడే కూర్చుని పోవడం అలవాటైందని కొడాలి నాని అన్నారు. ఆయన స్కూలేమిటంటే ప్రజా ప్రతినిధులందరూ ప్రజలను కలుసుకోవాల్సిందేనని, తమలాంటి వాళ్లు కొంత బద్ధకిస్తుంటారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టాస్క్ ను ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుందని, దీన్ని తాను నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

ఐప్యాక్ తో నిఘా..
తనలాంటి కొందరు ఎమ్మెల్యేలపై జగన్ ఐప్యాక్ తో నిఘా పెట్టారని కొడాలి నాని వివరించారు. రోజుకు కనీసం ఆరు గంటలైనా తిరగాల్సిందేనని చెప్పారు. తాను మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నానని, ఇకపై అది కుదరదని జగన్ తేల్చి చెప్పారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని జగన్ ఆదేశించారని, దీనికోసం తాము కృషి చేస్తామని వ్యాఖ్యానించారు.

జగనన్నే మా భవిష్యత్
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం గురించి కొడాలి నాని వివరించారు. మార్చి 18 నుంచి 26 వరకూ దీన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు పాల్గొంటారని, వారిని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతను జగన్ ఎమ్మెల్యేలకు అప్పగించారని వివరించారు. గత ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాలు, గ్రాఫిక్ పరిపాలన- తమ ప్రభుత్వంలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నదే దీని ఉద్దేశమని చెప్పారు.












Click it and Unblock the Notifications