అదే నా అసమర్ధత-గన్నవరం వెళ్లనన్నా- టికెట్ నిరాకరణపై వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి ఫైర్..
ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా తాజాగా సిట్టింగ్ స్ధానం పెనమలూరు కోల్పోయిన ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి ఇవాళ సంచలన వ్యాఖ్యలుచేశారు. తాజాగా వైసీపీ విడుదల చేసిన ఇన్ ఛార్జ్ ల మార్పులో ఆయన సీటు పెనమలూరును మంత్రి జోగి రమేష్ కు సీఎం జగన్ అప్పగించారు. దీనిపై ఇవాళ పార్ధసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం వెనుక కారణాలన్ని సారధి వెల్లడించారు.
తనకు గతంలో ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదంటూ వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి వ్యాఖ్యానించారు. అలాగే అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్ధతా అని ప్రశ్నించారు. విపక్షాలపై దౌర్జన్యాలు చేయలేకపోవడం తన అసమర్ధతలా ఉందన్నారు. వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం అనేది నేతి బీరకాయలో నెయ్యిలాంటిదే అన్నారు.

పెనమలూరు నుంచి తనను వైసీపీ గెలిచే పరిస్ధితి లేని గన్నవరం సీటుకు వెళ్లమన్నారని పార్ధసారధి వెల్లడించారు. తాను బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా ఫర్వాలేదని అనుకున్నట్లున్నారన్నారు. కానీ తాను ఇందుకు ఒప్పుకోలేదన్నారు. అది పార్టీకి నచ్చలేదన్నారు. బలహీనవర్గాలకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని గతంలో తాను చెప్పానని, అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదని సారధి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారని, మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరంటూ సారధి వ్యాఖ్యానించారు.
మరోవైపు వైసీపీలో టికెట్ రాదని తేలిపోవడంతో పార్ధసారధి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో సారధి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ నెల 18న చంద్రబాబు గుడివాడలో రా-కదలిరా సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో సారధి టీడీపీలో చేరే అవకాశం ఉంది. అయితే సారధి పెనమలూరు నుంచే సీటు కోరుతుండటంతో టీడీపీ ఏం హామీ ఇస్తోందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications