బీజేపీయా, టీడీపీయా: కొణతాల డైలమా, సైకిలేనని..
విశాఖ: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాలా లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలా అనే విషయమై డైలమాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరాలనే విషయమై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఆయన అనుచరులు చాలామంది టీడీపీలో చేరాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
గ్రామాల్లో సైకిల్ గుర్తు అందరికీ తెలుసునని, బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వు ఎవరికీ అంతగా తెలియదని ఆయనకు ఆయన అనుచరులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారట. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉందని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే సైకిల్ ఎక్కాలని కొణతాలకు సూచించారని తెలుస్తోంది.
తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుచరులు, అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తానని చెప్పిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ శుక్రవారం యెలమంచిలి నియోజకవర్గంలోని మునగపాకలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కొణతాల మాట్లాడారు. తనకు పదవులకన్నా ప్రజాభిమానమే ముఖ్యమని, ఏ పార్టీలో చేరాలన్న దానిపై అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు.
అందరినీ సంప్రదించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని, అందుకే కొంత జాప్యం జరుగుతుందన్నారు. అనకాపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నుంచి రోజుకో నియోజకవర్గం చొప్పున కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటానని కొణతాల చెప్పారు.
భవిష్యత్తు రాజకీయంపై అందరూ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే టీడీపీలో చేరవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని, మన జిల్లాను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసుకుందామని ఆయన చెప్పారు. ఆ మాటల గూడార్థం అదే అంటున్నారు.












Click it and Unblock the Notifications