వీళ్లంతా కచ్చితంగా చంద్రబాబును ముంచేవారే!?
తెలుగుదేశం పార్టీకి చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు మారరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధినేత చంద్రబాబు పార్టీ కోసం రాష్ట్ర మంతటా తిరుగుతూ కష్టపడుతుంటే ఇక్కడి నాయకులు కనీసం మినీ మహానాడును కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలోకి జారిపోయారు. ఇప్పటికే రెండుసార్లు బహిరంగంగా చంద్రబాబు చెప్పినప్పటికీ వీరి తీరు వీరిదే. అధినేత మాటలను లెక్కచేయడంకాదు కదా.. తామే ఎక్కు వ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.

పార్టీకన్నా వీరి అహంకారమే...
దీనివల్ల పార్టీకి నష్టం చేకూరుతోందనే విషయంపై అవగాహన ఉన్నప్పటికీ పార్టీకన్నా వీరి అహంకారమే ఆధిపత్యంలో ఉంది. అహం తగ్గించుకోరు.. కలవరు.. అధినేత మాట వినరు.. చివరకు పార్టీని ముంచుతారు అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాజీ మంత్రి దేవినేని ఉమాపై మండిపడిన సంగతి తెలిసిందే. కేశినేని నానికి, పార్టీలోని ఇతర నేతలైన దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్ధా వెంకన్న తదితరులతో పడటంలేదు. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని రంగంలోకి దించారని, రానున్న ఎన్నికల్లో సీటును అతనికిచ్చేలా వీరంతా పావులు కదుపుతున్నారనే అనుమానంలో కేశినేని ఉన్నారు.

కేశినేని వ్యవహారశైలితో నష్టమే..
అంతేకాకుండా అధినేత చంద్రబాబుతో పలు సందర్భాల్లో కేశినేని వ్యవహరించిన తీరు కూడా అతనికి నష్టం చేకూర్చేలా ఉంది. విజయవాడ పశ్చి నియోజకవర్గం నుంచి చంద్రబాబు అనుమతిస్తే కేశినేని పోటీచేయాలనే యోచనలో ఉన్నారు. అయితే బుద్ధా వెంకన్న మాట్లాడుతూ తాను పోటీచేస్తానని, ఆ నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంటే కేశినేనిని ముందుగానే ఇక్కడ అడ్డుపుల్ల వేశారు.

నేతలు ఇలా కొట్లాడుతూనే ఉంటారు?
గుడివాడలో ఇంతవరకు కొడాలి నానికి ధీటైన అభ్యర్థిని నియమించలేదు. రావి వెంకటేశ్వరరావు తాను పోటీచేస్తానని చెబుతున్నారు. ఆ విషయాన్ని ఖరారు చేయలేదు. నందిగామ నుంచి అమరావతి ఉద్యమకారుడు కొలికపూడి శ్రీనివాసరావును పోటీచేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గన్నవరం కూడా ఫైనల్ చేయలేదు. ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను నియమించుకుంటూ వస్తోన్న చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలకు మాత్రం ఫైనల్ చేయలేకపోతున్నారు. అభ్యర్థుల కోసం అన్వేషణ, కూడికలు, తీసివేతలతోపాటు జిల్లా టీడీపీ నాయకుల విభేదాలు కూడా దీనికి అడ్డుగా మారుతున్నాయి.
చంద్రబాబు మదిలో ఏముందో తెలిస్తేకానీ కృష్ణా జిల్లా రాజకీయాలపై ఒక స్పష్టత రాదు. అప్పటివరకు నేతలు ఇలా కొట్లాడుకుంటూనే ఉంటారు.












Click it and Unblock the Notifications