రజనీకాంత్ బిజెపిలోకి వస్తే బాగు: రెబెల్ స్టార్
కాకినాడ: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బిజెపిలో చేరితే మంచిదని తెలుగు రెబెల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. రాజకీయాల పట్ల రజనీకాంత్ వైఖరి కాస్తా మారిందని, గతంలో రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉన్న రజనీకాంత్ ఇప్పుడు భగవంతుడు ఆదేశిస్తే వస్తానని అంటున్నారని ఆయన గుర్తు చేశారు.
రజనీకాంత్ చేరితే తమిళనాడులోనే కాకుండా దక్షణ భారతదేశంలో బిజెపి బలపడుతుందని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహ కల్ప సమీపంలో ఆయన సతీసమేతంగా రోడ్లు ఊడ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఆయన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులతో కలెసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ తర్వాత కామినేని శ్రీనివాస్ భీమవరం ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో అసలు సరైన సౌకర్యాలే లేవని, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలను మెరుగుపరుస్తామని, దీన్ని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామని కామినేని శ్రీనివాస్ అన్నారు.












Click it and Unblock the Notifications