ఎక్కడి నుండైనా సిద్ధం: కృష్ణం రాజు, 'మోడీ ఫర్ పిఎం'
రాజమండ్రి/చిత్రూరు: పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ఎక్కడి నుండైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ టాలీవుడ్ నటుడు కృష్ణం రాజు సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలే కోరుకుంటున్నారని చెప్పారు.
కాగా, కృష్ణం రాజు ఇటీవల బిజెపిలోకి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం హయాంలో కృష్ణం రాజు కేంద్రమంత్రిగా ఉన్నారు. 2009లో ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజమండ్రి నుండి పోటీ చేశారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ బిజెపిలో చేరారు. ఆయన రాజమండ్రి నుండి పోటీ చేసే అవకాశముంది.

మోడీ సభలకు అనూహ్య స్పందన
తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభలకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు చిత్తూరు జిల్లా తిరుమలలో అన్నారు. దక్షిణాదిలో కూడా మోడీ ప్రభావం ఉందని చెప్పారు.
ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారని, మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారన్నారు.
సీమాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో బిజెపి ర్యాలీలు నిర్వహిస్తుందని, ఈ నెల 29న విజయవాడలో 'మోడీ పర్ పిఎం' కార్యక్రమం నిర్వహించనున్నమని వెల్లడించారు. తరువాత ఫిబ్రవరి 2 అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications