డబ్బా ఎందుకు, దమ్ముంటే రా: పవన్ కళ్యాణ్‌కు కెటిఆర్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన, ఆయన పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పవన్ పార్టీ పెట్టాలని విన్నానని, ఆయన తన పార్టీ పేరును జనసేన అని పెట్టడం కంటే.. మోడీ భజన సేన అని చెబితే బాగుండేదన్నారు.
పార్టీ పెట్టడం ఎందుకు ఇంకొకరికి డబ్బా కొట్టడం ఎందుకని చురకలు అంటించారు. పార్టీ పెట్టిన సమయంలో బిల్డప్, రెండు గంటల లైవ్ ఇవన్నీ అవసరమా అన్నారు. గొప్ప నాయకుడు దిగి వచ్చినట్లు చెబుతున్నారని.. పవన్‌కు దమ్ముంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.

మోడీకి, బిజెపికి మద్దతు పలుకుతున్న పవన్.. గెలిస్తే తన వల్ల గెలిచిందని లేదంటే తనకు తెలియదని చెబుతారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే పవన్ పోటీ చేసి గెలవాలన్నారు.
కాగా, తెరాసకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ లోకసభ సీట్లను సాధించాలని కెటిఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎన్సీపి, తమిళనాడులో ద్రవిడ పార్టీలు సీట్లు గెలుచుకొని భారీగా నిధులు రాబట్టుకున్నాయన్నారు. అలాగే తెరాసను గెలిపిస్తే ఎక్కువ నిధులు వస్తాయన్నారు. జాతీయ పార్టీల ప్రభావం ఏమాత్రం లేదన్నారు. తమను గెలిపిస్తే పోరాడి నిధులు తెస్తామన్నారు. దళిత సిఎం అంశాన్ని కెసిఆర్ ఉపసంహరించుకోలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications