అబద్ధాల పురాణం: సిఎంను ఉతికి ఆరేసిన కెటిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తీవ్రంగా ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాల పురాణం విప్పారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి సిగ్గు, లజ్జ లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజెత్తారు. నలుగురు బాబుల ఆధిపత్య పోరులో భాగంగానే ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నది ఒకే రాష్ట్రంలో ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరుకోవడం సమంజసమా అని ఆయన అడిగారు.
సీమాంధ్ర పండాలి, తెలంగాణ ఎండాలి, నేను సిఎంగా ఉండాలి అనే పద్ధతిలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అవగాహనా రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన అన్ారు. జలవివాదాలున్నాయి కాబట్టి దేశంలో రాష్ట్రాలే ఉండకూడదనే పద్ధతిలో కిరణ్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
వల్లబ్ బాయ్ పటేల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పాటుపడ్డారని ముఖ్యమంత్రి అన్నారని, 1950లోనే పటేల్ మరణించారని, 1953లో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదని ఆయన అన్నారు. ఒకే భాషా ప్రాంతం ఒకే రాష్ట్రంగా ఉంటే భాషోన్మాదం తలెత్తుతుందని థార్ కమిషన్ చెప్పిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రివన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు సర్వే 1903లో జరిగిందని, 1955 డిసెంబర్ 10వ తేదీన దానికి అన్ని అనుమతులు వచ్చాయని, అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదని, అయితే ఆ తర్వాత కెఎల్ రావు అనే ఇంజనీర్ ప్రాజెక్టును 20 కిలోమీటర్ల ముందుకు జరిపి తెలంగాణకు అన్యాయం చేశాడని ఆయన అన్నారు. తెలంగాణకు 270 టిఎంసి నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని చెబుతూ అందులో తెలంగాణకు ఎంత ఇస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిని అడిగారు.
జలయజ్ఞం జలద్రోహం, ధన యజ్ఞమని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లకు మొబిలైజన్ అడ్వాన్స్‌ల కింద డబ్బులు కట్టబెట్టడానికి మాత్రమే దాన్ని చేపట్టారని ఆయన ఆరోపించారు. జలయజ్ఞం ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 45 వేల కోట్ల రూపాయలు కావాలని అంటున్న సిఎం అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందంటున్నారని ఆయన అన్నారు. మానసిక సమతులన తప్పి, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఆయన సిఎంపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఇవ్వాల్సిన గోదావరి, కృష్ణా జలాలు ఎందుకు ఇవ్వలేదని అడిగితే గోదావరి నది నీళ్లు భూభాగం కన్నా కింద ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారని అంటూనే తెలంగాణ ఏర్పడితే గోదావరి నీళ్లు ఆపుకుంటారని అంటున్నారని ఆయన అన్నారు. ఎత్తిపోతల సాంకేతిక పరిజ్ఝానం లేదని ముఖ్యమంత్రి చెప్పడం అబద్ధమని, 1974 నుంచి ఎత్తిపోతల పరిజ్ఞానాన్ని దేశంలో వాడుతున్నారని ఆయన గుర్తు చేసారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడం వల్లనే నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టుకోగలిగామని ముఖ్యమంత్రి చెప్పడం కూడా నిజం కాదని ఆయన అన్నారు. వాటిని పూర్తి చేసిన ప్రభుత్వం తెలంగాణలోని శ్రీరాంసాగర్ రెండవ దశ ప్రాజెక్టును 40 ఏళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదని ఆయన అడిగారు.
శ్రీశైలం నుంచి రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు సమానంగా రావాల్సి ఉండగా, ఏక కాలంలో ఇరు ప్రాంతాల ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉండగా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి, తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన అన్నారు. రాయలసీమలో శ్రీశైలం నీటి ఆధారంగా కట్టిన ప్రాజెక్టులకు అనుమతులు లేవని, నీటి కేటాయింపులు లేవని ముఖ్యమంత్రే అంటున్నారని, ఆ ప్రాజెక్టులకు నీరు తరలించడం జలచౌర్యం కాదా, దోపిడీ కాదా అని ఆయన అడిగారు. అందుకు ముఖ్యమంత్రికి ఏం శిక్ష వేయాలని అడిగారు. మిగులు జలాలు ఎందుకు తీసుకుపోతున్నారంటే సర్దుబాటు అని ముఖ్యమంత్రి అన్నారని, ఎక్కువ కాలం ఆ ప్రాంతానికి చెందినవారు ముఖ్యమంత్రులు కావడం వల్లనే జలాన్ని దోచుకుపోయారని ఆయన అన్నారు.
జల విద్యుదుత్పత్తికి మాత్రమే వినియోగించాల్సిన శ్రీశైలం జలాలను 40 లక్షల ఎకరాలకు తరలిస్తున్నామని చెబుతూ వాటిలో 13 లక్షల ఎకరాలు మాత్రమే తెలంగాణకు చెందినవని ముఖ్యమంత్రే అంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నిబంధనల ప్రకారం శ్రీశైలం నీళ్లను విద్యుదుత్పత్తికి వాడితే 20 రోజుల్లో జలాశయం ఖాలీ అవుతుందని ముఖ్యమంత్రి అంటున్నారని, అంటే విద్యుత్తు దోపిడీ, జలదోపిడీ ఇదే విధంగా కొనసాగడానికే విభజనను ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. గత 57 ఏళ్లుగా కొనసాగుతున్న జలదోపిడీనీ కొనసాగించడానికే రాష్ట్రాన్ని విభజించకూడదని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన విమర్శించారు.
సీమాంధ్ర ఉద్యోగుల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యోగులకు నష్టచేస్తూ నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని అడిగారు. విభజన జరిగితే సీమాంధ్ర ఉద్యోగులకు జరిగే లాభనష్టాల గురించే మాట్లాడిన సీఎం తెలంగాణ ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తెలంగాణకు చెందినవారు ఎందుకు కొనసాగుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications