కేటీఆర్ వర్సస్ పేర్ని నాని - ఎవరి దెబ్బకు దిగొచ్చారు..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ లో బిడ్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయం నుంచి ఏపీ వ్యవహారాలపై తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయటం..వాటికి ఏపీ మంత్రుల కౌంటర్లతో రాజకీయం వేడెక్కింది. బిడ్ కోసం తెలంగాణ అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ విశాఖకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని ప్రకటించారు. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు.
వీటిపై అర్ ఐ ఎన్ ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీని పైన మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉక్కు పైన గట్టిగ మాట్లాడింది మన ముఖ్యమంత్రి కేసిఆర్ అని చెప్పుకొచ్చారు. తాము తెగించి కొట్లడాము కాబట్టే కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన చేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం పై వెనక్కి తగ్గిందని చెప్పారు. కేసిఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఇది బీఆర్ఎస్ విజయంగా పేర్కొన్నారు. ఈ దెబ్బకు ఏపీలోని రెండు పార్టీలు కామ్ అయ్యాయని వ్యాఖ్యానించారు.
మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన ఏపీ నుంచి మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వీళ్లను చూసి తగ్గిందా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్లు ఉంటుందన్నారు. మరి తెలంగాణలో ఎందుకు తగ్గటం లేదని ప్రశ్నించారు. హరీష్ రావుది రాజకీయాల్లో మహా తెలివైన బుర్రని వ్యాఖ్యానించారు.

చంద్రబాబులా మామను వెన్నుపోటు పొడవటానికి హరీష్ సిద్ధంగా ఉన్నాడని పేర్ని నాని విమర్శించారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారంటూ కామెంట్ చేసారు. కేసీఆర్ పై కడుపు రగిలినప్పుడల్లా మిమ్మల్ని కెలుకుతుంటారని..మా చేత కేసీఆర్ ను తిట్టిస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రజల మీద ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో హరీష్ రావు చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications