హోదాను అభ్యంతరకరంగా మార్చే ప్రయత్నం: కేవీపీ, చిన్నపిల్లలతో చిక్కులు!
తిరుపతి: ప్రత్యేక హోదా అనే పదాన్ని కొందరు అభ్యంతరకర పదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు బుధవారం అన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పై ప్రజా బ్యాలెట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసమని చర్చ నేపథ్యంలో తమ పార్టీ రెండుసార్లు విప్ జారీ చేసిందని చెప్పారు. హోదా అనే పదాన్ని కొందరు అభ్యంతరకరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ దక్కుతుందనే హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు.
తెలుగుదేశం, బీజేపీలు పంచుకొని తినేందుకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని రఘువీరా అన్నారు. వారు కమీషన్ల కోసం కక్కుర్తిపడి నకిలీ ప్యాకేజీని కోరుకుంటున్నారన్నారు. దాని వైపు మేం నిలబడమన్నారు. తమకు హోదా కావాలన్నారు. ప్రజా బ్యాలెట్ సందర్భంగా ఇక్కడి వారు మాకు స్ఫూర్తినిచ్చారని చెప్పారు.

ప్రత్యేక హోదా కావాలా వద్దా అని ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే.. కేవలం ఒక్క బాక్సులోనే వేలాది మంది హోదా కావాలని చెప్పగా, 12 మంది వద్దని చెప్పారన్నారు. ఇంకా పది బాక్సులు ఉన్నాయన్నారు. ఈ ప్రజాభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.
కాంగ్రెస్ నేతలు తిరుపతిలో బుధవారం ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండింటిలో రాష్ట్రానికి ఏది అవసరమో, దేనిని ప్రజలు స్వాగతిస్తారో తెలుసుకోవటం కోసం కొన్ని బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పిసిసి అధ్యక్షులు రఘువీరా సహా పలువురు రాష్ట్రస్థాయి నేతలు హాజరయ్యారు. ప్రసంగాలతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రజల క్యాటగిరిలో తమ తమ అభిప్రాయాలను బ్యాలెట్‌లో వేశారు. పలువురు వచ్చి బ్యాలెట్‌లో అభిప్రాయం తెలిపారు.
ప్రజా బ్యాలెట్‌లో చిన్నపిల్లలు!
కాంగ్రెస్ పార్టీతో పాటు మూడు రోజుల క్రితం లెఫ్ట్ పార్టీలు కూడా ప్రజా బ్యాలెట్ నిర్వహించాయి. సిపిఐ సీనియర్ నేత నారాయణ విజయవాడలో పెద్ద ఎత్తున ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు.
కానీ అభిప్రాయం చెప్పడానికి ప్రజలెవరూ రాకపోవడంతో ఆ బాధ్యతను లెఫ్ట్ పార్టీల నేతలు.. చిన్న పిల్లలకు అప్పగించారని, అది కూడా అందరి తరపున వారికే బాధ్యత అప్పగించారని, బ్యాలెట్ పేపర్, పెన్ను అప్పగించి టిక్కులు పెట్టేసుకోమని స్వేచ్ఛ ఇచ్చారని, దాంతో ప్రజా బ్యాలెట్ కాస్తా చిన్నపిల్లల బ్యాలెట్‌గా మారిందని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications