అప్పుడు నో, ఇప్పుడు పెప్పర్: లగడపాటి యూ టర్న్
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ గురువారం లోకసభలో పెప్పర్ స్ప్రే చల్లి సంచలనం సృష్టించారు. పార్లమెంటును గందరగోళపర్చే సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు ఆయనే స్వయంగా లోకసభలో ఎన్నడూ లేని విధంగా గందరగోళం సృష్టించారు. పెప్పర్ స్ప్రే చల్లడంపై ఇతర పార్టీ నేతలే కాకుండా కాంగ్రెసు పార్టీ నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.
కొందరైతే ఇది హత్యాయత్నమేనంటున్నారు. 2009లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన తర్వాత కేంద్రం వెనక్కి పోయింది. దీంతో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పలుమార్లు ఉభయ సభలను అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. వారికి ధీటుగా లగడపాటి మొదటి నుండి సమైక్యాంధ్ర గళమెత్తుతున్నారు. అంతేకాదు సభలకు అడ్డుపడుతున్న వారిపై కఠిన చర్యలు ఉండాలని ఆయన సభలో, బయటా అభిప్రాయపడ్డారు.

ఇందుకు సంబంధించి ఐదేళ్ల క్రితం లోకసభలో ఆయన ప్రయివేటు బిల్లును కూడా ప్రవేశ పెట్టారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ఎంపీలను అదుపు చేయాలని ఆ బిల్లు ప్రవేశ పెట్టారు. సభ్యులకు జరిమానా విధించాలని ఆయన తన బిల్లులో కోరారు. ఇప్పుడు ఆయనే లోకసభలో పెప్పర్ స్పే ద్వారా గందరగోళం సృష్టించారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, లగడపాటితో పాటు సీమాంధ్ర ప్రాంత సభ్యులు దానిని సమర్థించుకుంటున్నారు. తనకు ప్రాణహానీ ఉందని నిఘావర్గాల హెచ్చరికలు ఉన్నాయని, అందుకే తన వద్ద ఎప్పుడు ఓ పెప్పర్ స్ప్రే ఉంటుందని, ఇతర సభ్యులు తమ పైన దాడి చేసి కొట్టబోతుండగా రక్షణ కోసం తాను దానిని ఉపయోగించానని లగడపాటి వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications