రాష్ట్రపతిపై హైకోర్టుకు లగడపాటి: 17న కిరణ్ రిజైన్, పార్టీ!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లుకు రాష్ట్రపతి అనుమతి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమంటూ లగడపాటి రాజగోపాల్ గురవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడవ అధికరణకు విరుద్ధంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ అధికరణ కింద శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా స్వీకరించాల్సి ఉంటుందన్నారు. శాసనసభ తిరస్కరించిన బిల్లును పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కేంద్ర మంత్రివర్గం కూడా అసెంబ్లీ తీర్మానాన్ని పక్కనపెట్టి విభజనకు ముందుకు వెళ్లడమంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ, రాష్టప్రతి సచివాలయాన్ని రెస్పాండెంట్స్‌గా చేర్చారు. ఈ పిటిషన్ వచ్చే సోమవారం హైకోర్టులో విచారణకు రావచ్చును. అసెంబ్లీ తీర్మానాన్ని పట్టించుకోకుండా కేంద్రమంత్రివర్గం బిల్లుకు సవరణలు చేసి, దానిని రాష్ట్రపతి ముందు ఉంచిందని, దానిని రాష్ట్రపతి ఈ నెల 10న ఆమోదించారని పేర్కొన్నారు. లగడపాటితో పాటు కాకినాడ మాజి ఎంపి శ్రీహరి రావు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
17న కిరణ్ రాజీనామా?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 17వ తేదీన తన పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 17న గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశాలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన చర్చలో కిరణ్ ఈ విషయాన్ని వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచి చూడాలని మంత్రి గంటా శ్రీనివాస రావు సూచించారు. కొత్త పార్టీ పెడితే తమతో ఎవరెవరు వస్తారని కిరణ్ ఆరా తీస్తున్నారట.












Click it and Unblock the Notifications