రాజధానికి అడుగులు: తాడేపల్లి రైతులు షాకిచ్చారు
గుంటూరు: ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో బుధవారం నుంచి భూసమీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో 26 బృందాలు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాల్లో బుధవారం పర్యటించి రైతుల నుంచి అంగీకార పత్రాలను సేకరించాయి.
రాజధాని నగరం తమ గ్రామాల్లో రావడంతో చాలామంది రైతులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. భూసమీకరణకు నియమితులైన 26 బృందాలు బుధవారం కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, మంగళగిరి, నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి, బోరుపాలెం, దొండపాడు, ఐనవోలు, రాయపూడి, లింగాయపాలెం, నెక్కల్లు, నేలపాడు, శాకమూరు, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, మందడం, అనంతవరం గ్రామాల్లో పర్యటించాయి.

ఒక్కో బృందానికి వెయ్యి నుంచి 1400 ఎకరాల భూమిని సేకరించే బాధ్యతలు అప్పగించారు. సీఆర్డీఏ చట్టం 9(3) ప్రకారం రైతుల నుంచి ఈ బృందాలు అంగీకారపత్రాలను సేకరించాయి. బుధవారం 34 మంది డిప్యూటీ కలెక్టర్లను బుధవారం ప్రభుత్వం సీఆర్డీఏకు బదిలీ చేస్తూ వారిని గుంటూరు కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే, డిప్యూటీ కలెక్టర్లు పూర్తిస్థాయిలో బాధ్యతలను తీసుకోకపోవడంతో కొన్ని బృందాలకు తహసీల్దారులే నేతృత్వం వహించారు. భూసమీకరణ నోటిఫికేషన్ విడుదల చేసే అధికారాన్ని ఇంకా ఎవరికి కేటాయించలేదు.
రైతులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు ప్రక్రియను ప్రారంభించారు. తుళ్లూరు, నేలపాడు, లింగాయపాలెం తదితర గ్రామాల్లో రైతులు ముందుకొచ్చి తమ పట్టాదారు పాసుపుస్తకాలు, అంగీకారపత్రాలను సర్వే బృందాలకు అందజేశారు. రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామాల్లో భూసమీకరణ యూనిట్ కార్యాలయం నెలకొల్పుతామని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.
ప్రాథమికంగా జనవరి 15వ తేదీ లోపు రైతుల నుంచి అంగీకారపత్రాలను సేకరిస్తామన్నారు. చట్టం ప్రకారం నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల వరకు రైతులు అంగీకారపత్రాలు ఇచ్చేందుకు సమయం ఉంటుందని, అభ్యంతరాలకు 15 రోజుల సమయం ఉంటుందని తెలిపారు. అంగీకారపత్రాలు తీసుకొన్న తర్వాత పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. రికార్డుల పరంగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి భూయజమానిని నిర్ధారిస్తామన్నారు.
ఆ తర్వాత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నట్లుగా అంగీకారపత్రం అందజేస్తామన్నారు. భూసమీకరణ ప్రక్రియకు సమాంతరంగా రాజధాని మాస్టర్ ప్లాన్ సింగపూర్‌లో రూపుదిద్దుకొంటుందని తెలిపారు. మాస్టర్‌ప్లాన్ రాగానే జోన్లు, రోడ్లు మార్కింగ్ చేస్తామన్నారు. ప్రస్తుతం పంట వేసి రైతులు ఫలసాయం పొందేవరకు వాటిపై తాము ఎలాంటి చర్యలు చేపట్టబోమన్నారు.
రాజధాని పరిధిలోని తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో బుధవారం భూసమీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అధికారులకు రైతుల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. తుళ్లూరు మండలంలోని నేలపాడులో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాస్ పుస్తకాలను అధికారులకు ఇచ్చారు. తాడేపల్లి మండలంలోని తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో అధికారులకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరరేకత ఎదురైంది. తాము భూములిచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. కాగా, లంక భూముల్లో క్రీడ కమిషనర్ పర్యటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి వాటి అభిప్రాయాలను తెలుసుకోకుండా అన్నీ ఏకపక్ష నిర్ణయాలనే తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సీపీఐ శాఖ తీవ్రంగా విమర్శించింది. గడచిన ఆరు మాసాల్లో ఏ ఒక్క అంశంపై కూడా కనీసం ఒక్కసారైన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని కేవలం కొంతమంది నాయకులు, మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ అన్నీ ఏక పక్ష నిర్ణయాలను తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె రామకృష్ణ విమర్శించారు.












Click it and Unblock the Notifications